రెండు వేర్వేరు ప్రమాదాల్లో 23 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో దాదాపు 23 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలు పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన మియాన్వాలీ ప్రాంతం హర్లోని మౌర్, నీలం వ్యాలీలో బుధవారం చోటుచేసుకున్నాయి. అతివేగంగా వెళుతున్న ప్రయాణికుల బస్సు ఒకటి బోల్తా కొట్టింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 18 మంది అక్కడిక్కడే మృతిచెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం మియాన్వాలీ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
పాక్ ఆక్రమిత ప్రాంతమైన కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం నీలం వ్యాలీలో ఫాల్కా బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదాలు జరగడం సాధారణ విషయమే కానీ, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, రహదారులు సరైనవి లేకపోవడంతో తరుచూ రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.