Family story film
-
తెలంగాణ సామాజిక అంశంపై చిత్రం
‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగంలో మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. తెలుగు సినిమాల్లో తెలంగాణ పరిమళాలు పరిపూర్ణంగా వెదజల్లాలి’’ అని దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘కొమరంభీమ్’ చిత్రంతో ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన ఉద్యమం విజవంతమైంది. రాష్ట్ర సామాజిక, రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటీ? అన్న సామాజిక అంశంపై ఒక ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీని ప్లాన్ చేస్తున్నాం. ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర జలవనరుల చైర్మన్ వి. ప్రకాశ్ ఓ పరిశోధనాత్మక కథ రాశారు. ఈ కథతో సినిమా తీయనున్నాను. అలాగే తెలుగులో 50 రోజులాడిన ‘చిలుకూరు బాలాజీ’ చిత్రాన్ని ‘బాలాజీ మందిర్’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాం. ఈ చిత్రానికి కూడా దర్శకుడిని నేనే. ఓ ప్రముఖ బ్యానర్లో దర్శకుడిగా ఓ సినిమా కమిట్ అయ్యా’’ అన్నారు. గతేడాది జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో తాను తీసిన ‘డూడూ డీడీ’ ప్రదర్శి తమైందని, ‘సమక్క–సారక్క’ జాతరపై తీసిన డాక్యుమెంటరీకి ఫ్రాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అభినందనలు లభించడం ఆనందం’’ అని అన్నారు అల్లాణి. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘‘ఫ్యామిలీ డ్రామాలకు, ప్రేమ కథలకు నేను దూరం. కానీ, మొదటిసారి రియలిస్టిక్‌గా ఉండే ఫ్యామిలీ కథా చిత్రం చేయాలని భావించాను. ఇందులో క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అని దర్శకుడు శేఖర్ సూరి అన్నారు. రిషి, సోనియామాన్ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్ మూవీస్, స్ట్రీట్ ప్లే ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై వెంకటేశ్వర్లు, శేఖర్ సూరి, బి.ఆర్. రత్నమాలారెడ్డి నిర్మిస్తున్న ‘డా. చక్రవర్తి’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగార్కర్, కిషోర్, అశోక్ మున్ని కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అవుట్ అండ్ అవుట్ ప్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని నిర్మాతల్లో ఒకరైన వెంకటేశ్వర్లు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కురాకుల, కెమెరా: రాజేంద్ర, మాటలు: వి.ఆర్.ఎన్. శర్మ.