కొలంబియా ప్రభుత్వానికి షాక్!
శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ప్రజలు
బొగొటా: కొలంబియా ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలు షాక్ ఇచ్చారు. గత నెల 26న ప్రభుత్వానికి,ఎఫ్ఏఆర్సీ(కొలంబియన్ విప్లవ సాయుధ బలగాలు) రెబల్స్‌కు మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్ని తిరస్కరించారు. ఒప్పందంపై ఆదివారం పభుత్వం రెఫరెండం నిర్వహించగా 50.23 శాతం మంది వ్యతిరేకంగా.. 49.76 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. ప్రస్తుతం తమ ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికా లేదని, అయితే శాంతియుత వాతావరణం కొనసాగడానికి చర్చలు కొనసాగుతాయని అధ్యక్షుడు మాన్యుయేల్ శాంటోస్ చెప్పారు. ఎఫ్ఏఆర్సీ 52 ఏళ్లుగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది.
ఫలితంగా 2.5 లక్షల మంది చనిపోయారు. నాలుగేళ్ల చర్చల అనంతరం గత నెల 26న శాంతి ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఎఫ్ఏఆర్సీ ఆయుధాల్ని త్యజించి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నిరాయుధ జోన్‌కు వెళ్లాలి. కానీ తాజా రెఫరెండంతో ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అనేక మందిని చంపిన ఎఫ్ఏఆర్సీని శిక్షించకుండా శాంతి ఒప్పందం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.