కేఎఫ్సీలో చికెన్ తినొద్దంటూ ఫత్వా
ఉత్తరప్రదేశ్లోని బరేలిలో ముస్లిం పెద్దలు ఓ విచిత్రమైన ఫత్వా జారీచేశారు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్సీ)లో చికెన్ తింటే అది పాపం అవుతుందని, అందువల్ల అక్కడ తినొద్దని దర్గా-ఎ-అలా హజరత్ మతపెద్దలు చెప్పారు. కేఎఫ్సీ ఔట్లెట్లలో అందించే చికెన్ హలాల్ చేసినది కాదని, అందువల్ల అది ఇస్లామిక్ చట్లాలకు లోబడి ఉండదని సీనియర్ ముఫ్తీ సలీమ్ నూరీ తెలిపారు. కేఎఫ్సీలో మాంసాన్ని ముస్లింల కళ్లెదుట ప్రాసెస్ చేయరని, అందువల్ల అది ఇస్లామ్ నిబంధనల ప్రకారం తప్పని ఆయన అన్నారు.
ఈ స్టోర్ల వద్ద ప్రదర్శించే హలాల్ సర్టిఫికెట్లకు ఏమాత్రం విలువ లేదని, మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి తాము ఎలాంటి విధానాలు అవలంబిస్తామో వాళ్లు అందులో రాయట్లేదని నూరీ చెప్పారు. కేఎఫ్సీ వాళ్లు ఇస్లామిక్ పద్ధతిలో మాంసాన్ని వండరు కాబట్టి షరియత్ చట్టానికి అది వ్యతిరేకమని ముఫ్తీ తెలిపారు. ఇంతకుముందు 'పోకెమన్ గో' ఆడటాన్ని కూడా ఇస్లాం ప్రకారం తప్పంటూ ఇదే మతపెద్ద ఓ ఫత్వా జారీచేశారు.