ఏడాది బాలిక కడుపులో 3.5 కేజీల పిండం
కోయంబత్తూర్: 'ఫీటస్ ఇన్ ఫీటు' అత్యంత అరుదుగా కనిపించే ఈ వ్యాధి తమిళనాడులోని ఏడాది బాలికకు వచ్చింది. 'ఫీటస్ ఇన్ ఫీటు' అంటే పసి వయసులో బాలికల గర్భంలో పిండం పెరగడం. రోజూ వారీ కూలీలైన రాజు, సుమతి దంపతుల కుమార్తె నిషా. మామూలు పిల్లల్ల కాకుండా ఆమెకు పొట్ట పెరుగుతూ వస్తోంది. ఇది గమనించిన తల్లిదండ్రలు పట్టించుకోలేదు.
ఆమె తీసుకునే ఆహారం మొత్తం పిండానికే సరిపోతుండటంతో.. నిషా శరీరంలోని భాగాలు క్రమంగా క్షీణించడం మొదలుపెట్టాయి. దీంతో కంగరూ పడిన తల్లిదండ్రులు ఆమెను ఎరోడ్ లోని ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. నిషా పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆయన మెట్టుపలయామ్ లోని పిడియాట్రిక్ సర్జన్ డా. విజయగిరి ని కలవాలని ఆమె తల్లిదండ్రలకు సూచించారు.
డాక్టర్ సూచనలను పరిశీలించిన తర్వాత విజయగిరి బాలిక కడుపులో కణితి ఉందని భావించారు. అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించిన విజయగిరి షాక్ కు గురయ్యారు. బాలిక పొట్టలో ఎముకలతో ఉన్న పిండం ఉందని గుర్తించారు. అత్యంత అరుదుగా కనిపించే 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పరిగణించిన ఆయన బాలికకు సర్జరీ చేసి పిండాన్ని బయటకు తీశారు.
బాలిక నుంచి పిండాన్ని వేరు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని డాక్టర్ తెలిపారు. పిండం బాలిక శరీరంలోని ఎడమ కిడ్నీ, పెద్ద పేగు ఎడమ భాగం, క్లోమం, ప్లీహం లను గట్టిగా పట్టుకుని ఉండటంతో వేరు చేయడం రిస్క్ అయిందని చెప్పారు. ఇందుకోసం ఆర్గాన్లకు రక్త సరఫరా చేస్తున్న రక్తనాళాలను విడదీసి.. పిండాన్ని తీసేసిన తర్వాత యథాస్థానాల్లో ఉంచినట్లు తెలిపారు. బాలిక నుంచి వేరు చేసిన పిండం 3.5 కిలోల బరువున్నట్లు చెప్పారు. పిండంలో ఎముకలకు సంబధించిన ఆనవాళ్లు ఉన్నట్లు వివరించారు. ఆపరేషన్ తర్వాత బాలిక త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు.