అనుకోని మలుపులలో ఆదుకునే పిలుపు
ఉమన్ ఫైనాన్స్ / వ్యక్తిగత ప్రమాద బీమా
ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గాని వారి కుటుంబ పోషణకు, భవిష్యత్తు లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేరు. మరి ఆ సంపాదించే వారికి అనుకోని ప్రమాదం జరిగితే వచ్చే ఆర్థిక ఇబ్బందులను ఆ కుటుంబం తట్టుకోగలదా? ఇలాంటి అనూహ్యమైన పరిస్థితులలో జీవిత, ఆరోగ్య బీమాతో పాటుగా వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ఎంతో చేయూతనిస్తుంది.
పాలసీదారుని మరణానంతరం వారి కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వడానికి జీవిత బీమా, అలాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులను తట్టుకోడానికి ఆరోగ్య బీమా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రమాదం కారణంగా పూర్తి కోలుకోవడానికి కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఈ క్రమంలో వారి ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రమాద బీమా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుంది. ఈ బీమా ఏ విధంగా పని చేస్తుందో చూద్దాం.
ప్రమాదం ద్వారా మరణం సంభవిస్తే...
పాలసీదారునికి ప్రమాదం ద్వారా మరణం సంభవించినట్లయితే అతను ఎంత మొత్తానికి పాలసీ తీసుకున్నారో ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అదనంగా వారి పిల్లల విద్యకు బోనస్‌ను (ఇద్దరు పిల్లల వరకు) ఇస్తున్నాయి.
శాశ్వతంగా పూర్తి వైకల్యం సంభవిస్తే...
ప్రమాదంలో కొన్నిసార్లు పూర్తి వైకల్యం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు రెండు కాళ్లు / రెండు చేతులు పోవడం. ఒక కాలు, ఒక చేయి పోవడం మొదలైనవి. ఈ సందర్భంలో ఆ వ్యక్తి ఎటువంటి పని చేయడానికీ వీలుండదు. ఇలాంటి వాటిని శాశ్వతమైన పూర్తి వైకల్యంగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు పాలసీదారుడు ఎంత మొత్తాన్ని పాలసీగా తీసుకుంటారో ఆ మొత్తాన్నీ, మరికొన్ని కంపెనీలు 10 శాతం, 20 శాతం అదనంగా కూడా అందజేస్తున్నాయి. అందుకే పాలసీ తీసుకోబోయే ముందు ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి తీసుకోవడం మంచిది.
శాశ్వత, పాక్షిక వైకల్యం...
కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు పాక్షికంగా కొంత మేర శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. అలాంటప్పుడు వైకల్యం ఎంత మేరకు (ఎంత శాతం) జరిగిందో, ఆ శాతం ఆధారంగా నష్టపరిహారం ఉంటుంది.
తాత్కాలిక వైకల్యం..
కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి కోలుకుని మళ్లీ పని చేయడం మొదలు పెట్టడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో అతను కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి వారానికి కొంత మొత్తాన్ని పాలసీదారునికి అందజేస్తారు.
వ్యక్తిగత బీమా పాలసీని వ్యక్తిగతంగానూ, ఆలాగే జీవిత భాగస్వామి, పిల్లల పేర్ల మీద కూడా ఒకే పాలసీ కింద తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తానికి పాలసీ ఇస్తారు అనేది మీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు కట్టే కంపెనీని బట్టి కూడా మారుతుంది.
పాలసీని తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ పాలసీ గురించి మీ కుటుంబ సభ్యులందరికీ ముందే అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఇలా అవగాహన కల్పించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం ఇవ్వడం, పరిహారం పొందడానికి అవసరమైన ఇతర పత్రాలు (పోలీస్ ఎఫ్.ఐ.ఆర్., వైద్య పరీక్షల నివేదికలు మొదలైనవి) సమకూర్చడంలో ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేకుండా ఉంటుంది. ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసుకోలేకపోవచ్చు. కానీ ఆర్థికంగా పూర్తి చేయూతనివ్వడానికి ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’