మూడుకు చేరిన అగ్ని ప్రమాద సిబ్బంది సంఖ్య
- బర్న్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన అగ్నిమాపక అధికారి సుధీర్
సాక్షి, ముంబై: దక్షిణ ముంబైలోని కాల్బాదేవిలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధీర్ అమీన్ అనే అగ్నిమాపక అధికారి గురువారం తుదిశ్వాస విడిచాడు. దీంతో ఈ సంఘటనలో మరణించినవారి సంఖ్య మూడుకు చేరింది. మృతులందరు అగ్నిమాపక సిబ్బంది కావడంతో అగ్నిమాపక దళంలో తీవ్ర విషాదం నెలకొంది. కాల్బాదేవి పాత హనుమాన్ వీధిలోని గోకుల్ నివాస్ భవనంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో అసిస్టెంట్ రీజినల్ అధికారి సంజయ్, బైకలా అగ్నిమాపక కేంద్రం చీఫ్ మహేంద్ర దేశాయి మరణించిన సంగతి తెలిసిందే. ఇదే సంఘటనలో తీవ్రంగా గాయపడిన సుధీర్ అమీన్ నవీముంబై ఐరోలిలోని ‘బర్న్’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. గురువారం మధ్యాహ్నం మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.
సంతాపం తెలిపిన గవర్నర్
ప్రాణాలు పణంగా పెట్టి మంటలను ఆర్పడంతోపాటు మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నించి వీరమరణం పొందిన అగ్నిమాపక అధికారి సుధీర్ అమీన్‌కు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు.