మందులు సర్వ నాశనం
♦ అవసరం కోసం పంపిస్తే నిర్లక్ష్యంగా పడేసిన వైనం
♦ మెడిసిన్‌కు ముగిసిన వాడకం గడువు
♦ ఉపాధి కూలీలకు చేరకుండానే చెత్తగా మారిన మందులు
నర్సాపూర్ : ఉపాధి కూలీలు పని చేసే చోట గాయపడినప్పుడు ప్రాథమిక చికిత్స చేసేందుకు అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను సుమారు రెండేళ్ల క్రితం ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే విచిత్రంగా కూలీలకు చేరకముందే వాటి ఎక్స్పైర్డ్ తేదీ ముగిసింది. రెండేళ్ల క్రితం వచ్చిన మెడికల్ కిట్లు స్థానిక క్లస్టర్ ఆఫీసులోని ఓ గదిలో పడి ఉన్న తీరు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా స్థానిక క్లస్టర్ అధికారి మాత్రం మెడికల్ కిట్లు రాగానే పంపిణీ చేశామని చెప్పడం గమనార్హం.
మూలన పడేసిన వైనం
డ్వామా నర్సాపూర్ క్లస్టర్ పరిధిలో నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంతోపాటు కౌడిపల్లి, హత్నూర, శివ్వంపేట మండలాలు, పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, జిన్నారం, రామచంద్రాపూర్ మండలాలు ఉన్నాయి. కాగా రామచంద్రాపూర్‌లో జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఎవరూ లేరు. కాగా మిగిలిన ఆరు మండలాల్లో సుమారు 4272 గ్రూపులు ఉండగా సుమారు 75వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకం పనులు చేస్తున్నారు.
వారు పనిచేసే చోట గాయపడినప్పుడు ప్రాథమిక చికిత్స చేసేందుకు అవసరమైన 200 ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లను ప్రభుత్వం జూలై 2013లో నర్సాపూర్‌లోని క్లస్టర్ కార్యాలయానికి సరఫరా చేసింది. వాటిని ఉపాధి హామీ కూలీల గ్రూపులకు అందచేయాల్సి ఉంది. అయితే క్లస్టర్ అధికారి వాటిని కూలీలకు పంపిణీ చేయకపోవడంతో ఆ 200 కిట్లలో ఉన్న మందుల వినియోగ తేదీ ముగిసిపోయింది. మెడికల్ కిట్లలో అయోడిన్, ఆయింట్మెంట్, స్పిరిట్ బాటిళ్లతోపాటు బ్యాండెయిడ్ క్లాత్, చికిత్సకు అవసరమైన ఇతర వస్తువులు ఉన్నాయి.
షెడ్డులకూ గతి లేదు..
2013 జూలైలో మెడికల్ కిట్లు నర్సాపూర్ క్లస్టర్ ఆఫీసుకు వచ్చినప్పటికీ వాటిని ఇంత వరకు కూలీలకు అవసరమైనప్పుడు వాడకపోవడంతో అవి నిరుపయోగంగా పడిఉన్నాయి. కాగా మెడికల్ కిట్లలో ఉన్న స్పిరిట్ ఉత్పత్తి తేదీ జనవరి 2013 ఉండగా, వినియోగ తేదీ డిసెంబరు 2014 వరుకు ఉంది. కాగా అయోడిన్, ఆయింట్మెంట్ ఉత్పత్తి తేదీ జూన్ 2013 ఉండగా వినియోగ తేదీ 2015 వరకు ఉంది. ఇవన్నీ కూలీలకు చేరకుండా క్లస్టర్ ఆఫీసులోని గదిలో మూలన పడి ఉన్నాయి. కాగా ఎండకాలం, వానా కాలం కూలీలు పనిచేసే చోట షెడ్డులాగా వేసుకునేందుకు టెంట్లు సైతం ఇవ్వలేదని తెలిసింది.
రాగానే పంపిణీ చేశాం
మా క్లస్టర్‌కు మెడికల్ కిట్లు జూలై 2013లో వచ్చాయి. అవి రాగానే కూలీల గ్రూపులకు పంపిణీ చేశాం. ఆ తర్వాత మళ్లీ మెడికల్ కిట్లు రాలేదు. - వసంత సుగుణ, క్లస్టర్ ఏపీడీ