తొలి సారథి పొన్నాలే..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తొలి అధ్యక్ష పదవి మనోడికే దక్కింది. జిల్లాకు చెందిన సీనియర్ నేత, తాజా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను వరించింది. అరవై ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ రథసారథిగా జిల్లా వాసి నియమితులు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు.
టీపీసీసీ అధ్యక్ష రేసులో వెనుకబడిన వర్గాలకు చెందిన పొన్నాల పేరు ఉన్నట్లు ప్రచారం సాగింది. రోజు మొత్తం కాంగ్రెస్ శ్రేణులు టీవీలకు అతుక్కపోగా... రాత్రి డిక్లేర్ కావడంతో ఒక్కసారిగా రోడ్డెక్కి సంబరాలు చేసుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే అవకాశం జిల్లాకు రావడం ఇది రెండోసారి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన కమాలొద్దీన్ అహ్మద్ బాధ్యతలు నిర్వర్తించారు. 1994 -96 మధ్య కాలంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు.
కమాలొద్దీన్ అహ్మద్ వరంగల్, హన్మకొండ ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. అరుుతే కమాలొద్దీన్ అహ్మద్, పొన్నాల జనగామ ప్రాంతంలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్కు చెందిన వారు కావడం విశేషం. ఒకే ప్రాంతానికి చెందిన వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులు కావడం విశేషం.
ఎన్నికల కమిటీలో ఇద్దరకి చోటు
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఏఐసీసీ స్థానం కల్పించింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ చోటు దక్కించుకున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
పొన్నాలను టీపీసీసీ చీఫ్గా నియమించారనే వార్తలు వెలువడగానే జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆయన అనుచరులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు.
హన్మకొండలోని ఆయన నివాసం, జనగామ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ జంగారాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వరద రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొన్నాలను టీపీసీసీ చీఫ్గా నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ బండా ప్రకాష్, పీసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మంచికట్ల శ్రీధర్, మాజీ శాప్ డెరైక్టర్ రాజనాల శ్రీహరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.