Fly Dubai
-
హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్ కేంద్రం!
♦ శంషాబాద్ వద్ద డెవలప్మెంట్ సెంటర్ ♦ యాప్స్ అభివృద్ధికి హ్యాక్మేనియాతో జట్టు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినూత్న యాప్స్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్ డెవలపర్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇక్కడి యువ డెవలపర్ల ప్రతిభను చూసిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్... హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం సంస్థకు భారత్‌లో తొలి డెవలప్మెంట్ సెంటర్ కావటం విశేషం. ఫ్లైదుబాయ్ ఐటీ, టెక్నాలజీ ఆవిష్కరణల్లో ఈ అభివృద్ధి కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. సాఫ్ట్వేర్ అభివృద్ధి, పరిశోధన, కార్యకలాపాలకు కేంద్ర బిందువు కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ డెవలప్మెంట్ సెంటర్‌కు ఫ్లై దుబాయ్ ఎంత పెడుతోంది? ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. జూలై 9న ప్రారంభమయ్యే హ్యాకథాన్‌లో ఈ వివరాలను ప్రకటించవచ్చునని తెలిసింది. యాప్స్ అభివృద్ధికి ఒప్పందం... అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్ఫేస్ (ఏపీఐ) యాప్ స్టోర్‌ను ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హ్యాక్‌మేనియా అనే స్టార్టప్ కంపెనీతో ఫ్లైదుబాయ్ చేతులు కలిపింది. ఎయిర్ ట్రావెల్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించిన యాప్స్‌ను అభివృద్ధి చేసేందుకు డెవలపర్లతో కలిసి హ్యాకథాన్‌ను ఈ హ్యాక్‌మేనియా నిర్వహిస్తుంది. హ్యాకథాన్ విజేతలకు ఫ్లైదుబాయ్‌లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. అలాగే వారి ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు అవకాశం కల్పిస్తామని ఫ్లైదుబాయ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రమేష్ వెంకట్ తెలిపారు. ఈ ఏడాది మూడు హ్యాకథాన్లు.. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జూలై 9-10 తేదీల్లో జరిగే హ్యాకథాన్‌లో 100 మందికిపైగా డెవలపర్స్ పాల్గొనే అవకాశం ఉందని హ్యాక్‌మేనియా చెబుతోంది. ‘‘15 ఉత్పత్తుల్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిలో అవసరమైన యాప్స్‌ను ఫ్లైదుబాయ్ తీసుకుంటుంది. విభిన్న థీమ్స్‌తో మరో రెండు హ్యాకథాన్లను కూడా నిర్వహించబోతున్నాం. మా కంపెనీ ఇప్పటిదాకా వివిధ సంస్థల కోసం 50 దాకా హ్యాకథాన్లను నిర్వహించిందని, దాదాపు 600లకుపైగా యాప్స్ కార్యరూపం దాల్చాయి’’ అని కంపెనీ వ్యవస్థాపకుడు రజత్ షాహి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ సహకారంతో హ్యాక్‌మేనియా ఏర్పాటైంది. కాగా, హ్యాకథాన్‌లో పాల్గొనే ఔత్సాహికులు జూలై 5లోగా తమ పేర్లను హ్యాకర్బే.కో వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. -
ఫ్లై దుబాయ్ విమాన సర్వీసులు పెంపు
సాక్షి ప్రతినిధి, చెన్నై : భారత్-దుబాయ్ మధ్య విమాన సేవలను విస్తృతం చేస్తున్నట్లు ఫ్లై దుబాయ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (కమర్షియల్ ఆపరేషన్స్) సుధీర్ శ్రీధరన్ వెల్లడించారు. దుబాయ్-చెన్నై మధ్య వారానికి మూడు విమాన సర్వీసులను బుధవారం చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుబాయ్ కేంద్రంగా తమ సంస్థ 2010లో లక్నోకు సేవల ద్వారా భారత్‌లో అడుగుపెట్టిందని అన్నారు. ఢిల్లీ, కొచ్చీ, ముంబయి, తిరువనంతపురం నుంచి దుబాయ్‌కు ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ప్రాంతాల నుంచి ఒక్క ఏడాదిలోనే ప్రయాణికుల సంఖ్యలో 70 శాతం ప్రగతి సాధించామని చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో ప్రారంభించుకున్న విమానసేవలతో కలుపుకుని దుబాయ్-భారత్ మధ్య సర్వీసుల సంఖ్య 29కి చేరుకుందని అన్నారు. అలాగే 46 దేశాల్లో 23 కొత్త రూట్ల ద్వారా 95 గమ్యాలకు సర్వీసులను నడపాలని గత ఏడాది నిర్ణయించినట్లు తెలిపారు. ఇక భారత దేశ పరిధిలో చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చీ, లక్నో, ముంబై, తిరువనంతపురం మధ్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. విమాన సర్వీసుల వేళలు, చార్జీలు స్థానిక కాలమాన ప్రకారం ఎఫ్‌జెడ్447 విమానం (మంగళ, గురు, శనివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ టెర్మినల్-2లో 22.05కు బయలుదేరి, చెన్నై ఎయిర్‌పోర్టుకు స్థానిక కాలమాన ప్రకారం 4గంటలకు చేరుకుంటుంది. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టులో ఎఫ్‌జెడ్448 విమానం (బుధ, శుక్ర, ఆదివారం) 4.45గంటలకు బయలుదేరి 7.35 గంటలకు చేరుకుంటుంది. వారానికి మూడు సర్వీసులు. ఎకనమిక్ క్లాస్ రాను..పోనూ రూ.14వేలు, బిజినెస్ క్లాస్ రానుపోను రూ.29వేలుగా నిర్ణయించారు.