దోమల నివారణకు 'ఫాగింగ్ డ్రైవ్'
న్యూఢిల్లీః ప్రభుత్వం దోమలపై యుద్ధం ప్రకటించింది. దోమలు లేని నగరంగా హస్తినను తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా నెలరోజుల పాటు ఫాగింగ్ డ్రైవ్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
రాజధాని నగరంలో డెంగ్యూ రోగుల శాతం రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దోమల నివారణకు నెలరోజుల ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభిస్తోంది. చికున్ గున్యా, డెంగ్యూ వైరస్ కు కారణమౌతున్న దోమలను నివారించి, ఢిల్లీని మస్కిటో ఫ్రీ నగరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక పొగ యంత్రాలను సేకరిస్తున్నారు. ముందుగా 200 యంత్రాలతో డ్రైవ్ ను ప్రారంభించి, మొత్తం 26,600 వరకూ యంత్రాలను పెంచుతామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీని మస్కిటో ఫ్రీ నగరంగా మార్చుతామన్న ఆయన.. దోమల నివారణకోసం నగరంలో పొగ వదిలే కార్యక్రమాన్ని వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ నిర్దేశాల మేరకు అనుసరించనున్నట్లు వివరించారు.
అయితే వైద్య నిపుణులు మాత్రం డీజిల్ తోపాటు దోమల నివారణ యంత్రాలు వదిలే పొగ పీల్చుకోవడం వల్ల ఆస్థమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులపై ఈ ప్రభావం మరింతగా ఉంటుందని సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ) ఓ నివేదికలో వెల్లడించింది.