సింహగిరి.. భక్తఝరి
సాక్షి,సింహాచలం(విశాఖపట్నం) : విరులు పులకించాయి. ఝరులు స్వాగతించాయి. గిరులు ఉప్పొంగిపోయాయి. అడుగులో అడుగేస్తూ అప్పన్నను తలుస్తూ ముందుకు సాగింది భక్తజనం. అన్ని దారులూ సింహగిరివైపే.. అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి తలపుతో గిరియాత్ర సాగిపోయింది.సింహ గిరీశా పాహిమాం..రక్షమాం..అంటూ భక్తజనం వేడుకుంది. స్వామే నడిపిస్తున్నారనే భావనతో అలవోకగా ప్రదక్షిణలో నిమగ్నమైంది. భక్తిభావం ఉప్పొంగింది. ఎటు చూసినా ఉత్సాహం.. ప్రదక్షిణోత్సాహం..
ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణలో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసేందుకు ఉదయం 8 గంటల నుంచే సింహాచలానికి భక్తులు చేరుకున్నారు. రాత్రి 10 వరకు ప్రదక్షిణ చేసేందుకు భక్తులు సింహాచలం తరలివస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు ప్రదక్షిణకు తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, యువత గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
ఘల్లుమన్న జానపదం
రథోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన ‘ఓం నమో వెంకటేశాయ భజన మండలి’ మహిళల డప్పు వాయిద్య కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకం.విజయనగరం జిల్లా పూసపాటిరేగకి చెందిన తప్పెటగుళ్లు, పులివేషాలు, విశాఖకి చెందిన కోలాటం తదితర ప్రదర్శనలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రదక్షిణలో పదనిసలు
భక్తుల సందడి ఉదయం 8 గంటల నుంచే మొదలైంది. 10 గంటలకు భక్తుల తాకిడి పెరిగింది. రథోత్సవం జరిగే సమయానికి 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోయింది.
తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ ఏడాది 26 క్యూలను ఏర్పాటు చేశారు.
నగరం నుంచి పాత గోశాల వైపు వచ్చే బస్సుల్ని ఉదయం నుంచే గోశాల జంక్షన్ వద్ద నిలిపివేశారు. కొన్ని వాహనాలను శ్రీనివాసనగర్ నుంచే అనుమతించలేదు. దీంతో చాలామంది భక్తులు శ్రీనివాసనగర్ నుంచి కాలినడకన తొలిపావంచా వద్దకు చేరుకున్నారు.
హనుమంతవాక నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో అడవివరం జంక్షన్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడి నుంచి తొలిపావంచాకి వచ్చే భక్తులను గాంధీనగర్, పుష్కరిణి, రాజవీధి మీదుగా మళ్లించడంతో భక్తులంతా ఆ మార్గంలోనే నడిచి వెళ్లారు.
కొంతమంది భక్తులు సింహగిరి ఘాట్‌రోడ్‌లోకి వెళ్లి కొత్త ఘాట్‌రోడ్డు మీదుగా అడవివరం జంక్షన్ చేరుకుని ప్రదక్షిణ చేశారు.
యువత సెల్ఫీలు తీసుకుంటూ ప్రదక్షిణ చేసారు.
రథోత్సవం ప్రారంభమయ్యే సమయానికి వరుణుడు చిరుజల్లులు కురిపించాడు. సాయంత్రం అడవివరంలో చినుకులు పలకరించాయి. భక్తులు తడుస్తూనే గిరి ప్రదక్షిణ చేశారు.