శబ్బాష్...26!
స్టడీ
స్నేహానికి వయసు ఉంటుందా? ఉండనే ఉండదు. ఇది నిజమేగానీ ‘26’ ఏళ్ల వయసుకు మాత్రం స్నేహచరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని చెబుతోంది తాజా అధ్యయనం. మన జీవితకాలంలో 26 ఏళ్ల వయసులో ఉన్నన్ని స్నేహాలు మరెప్పుడూ ఉండవని ‘ఫర్ఎవర్ ఫ్రెండ్’ అనే గ్రీటింగ్ కార్డుల తయారీ కంపెనీ అధ్యయనం తెలియజేస్తోంది.
ప్రస్తుత కాలంలో స్నేహపరిధిని పెంచడంలో సామాజిక అనుసంధాన వేదికలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయని చెబుతున్న ఈ అధ్యయనం ‘ఫేస్బుక్ ఫ్రెండ్షిప్’ గురించి కూడా చెప్పింది. ‘ఫేస్బుక్’ ద్వారా 25 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవాళ్లు 22 మంది, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు 12 మంది, 35 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లు కేవలం నాలుగు మంది స్నేహితులను కలిగి ఉంటున్నారని ‘ఫర్ఎవర్ ఫ్రెండ్’ వెల్లడించింది.
‘‘మనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది పాఠశాల దశలోనే ఉండడం యాదృచ్చికమేమి కాదు. నోట్స్, బహుమతులు, ఒకరితో ఒకరు పంచుకున్న జోకులు స్నేహాన్ని పెంచుతాయి. అయితే పెద్దవాళ్లకు మాత్రం వీటి విలువ తెలియక చాలా చిన్న విషయాలు అనుకుంటారు’’ అంటున్నాడు ‘ఫర్ఎవర్ ఫ్రెండ్’ బృంద నాయకుడు సామ్ వోవెన్.
ఫ్రెండ్షిప్లో కీలక పాత్ర పోషించే టాప్ 5 క్వాలిటీస్
1. యోగ్యత 85%
2. విధేయత 79%
3. హాస్యచతురత 62%
4. గౌరవం 57%
5. ప్రయాణాలను ఇష్టపడే స్వభావం 15%