నవ ధాన్యాలు పండించాలి
నంద్యాల, న్యూస్‌లైన్: వ్యసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి పొలాల్లో నవ ధాన్యాలు పండించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ ఆఫ్ ఎక్సెటెన్షన్ దండు రాజిరెడ్డి రైతులకు సూచించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు లాభాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా ఒకే పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే మేలైన వంగడాలు ఉత్పత్తి చేసేందుకు, రైతుల కష్టాలను పరిష్కరించేందుకు నిత్యం ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉన్నారన్నారు. మరో రెండు నెలల్లో దాదాపు 10 వేల గ్రామాల్లో ప్రభుత్వం నెట్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని, అందులో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం లభిస్తుందన్నారు. రైతులు క్లబ్‌లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ అధికారుల సలహాలు పొందాలన్నారు. జేడీఏ ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో శనగ దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనగను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
రైతుశ్రీ పథకం కింద రూ.లక్ష రుణంకు వడ్డీ లేదని, రూ.3లక్షల వరకు పావలా వడ్డీని వసూలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధన కేంద్రం ఏడీఆర్ పద్మలత మాట్లాడుతూ నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పచ్చజొన్న, తెల్ల జొన్నలకు సంబంధించి కొత్త రకాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. పచ్చజొన్నలో 2446 రకం, తెల్లజొన్నలో 2647 రకంను ఇప్పటికే మినీకిట్లుగా ఇచ్చామన్నారు. మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగంతో దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు.
స్పందన అరకొర: కిసాన్ మేళాకు స్పందన అంతంత మాత్రమే లభించింది. ఉదయం 10గంటలకు ఆరంభం కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైంది. 17మండలాలకు సంబంధించి మేళను నిర్వహించినప్పటికీ ఒక్క మహిళా రైతు కూడా హాజరు కాకపోవడం గమనార్హం మేళాకు వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తలు మాత్రమే హాజరయ్యారు. అనుబంధ శాఖలైన ఉద్యానవన, ఫిషరీష్, సిరికల్చర్, ఇరిగేషన్, తదితర అధికారులు డుమ్మా కొట్టారు. గతంలో జరిగిన కిసాన్ మేళాలో దాదాపు 40 ప్రదర్శనలు చేపట్టగా ప్రస్తుతం 17 మాత్రమే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించి 3, 4స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేయగా మిగిలినవన్ని ప్రైవేటు కంపెనీలకు సంబంధించినవి ఉన్నాయి.