సహారా సుబ్రత రాయ్కి సుప్రీంలో ఊరట
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతరాయ్కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గురువారం రాత్రి ఆయన తల్లి మరణించడంతో.. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాలుగు వారాల పెరోల్ మంజూరైంది. అయితే.. పెరోల్ సమయంలో ఆయన మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలోనే ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
సుబ్రతరాయ్తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్ చౌదరికి కూడా అంతే సమయం పాటు పెరోల్ ఇచ్చారు. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థలలో పెట్టుబడి పెట్టినవాళ్లకు ఆ సొమ్ము వెనక్కి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోవడంతో.. గత రెండేళ్లుగా సుబ్రతరాయ్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.