పిల్లల చదువుకు ప్లాన్ చేశారా?
నేనెప్పుడూ ఒకటే చెబుతుంటాను. మంచి చదువు చెప్పించడానికి మించి తల్లిదండ్రులు పిల్లలకిచ్చే గొప్ప బహుమతి మరొకటి లేదని. ఇది వారి భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తుంది. కాకపోతే పేరున్న విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయంలో పిల్లల చదివించాలన్న కోరిక ఇప్పటి తల్లిదండ్రులకు భయాన్ని కలిగిస్తోంది. దీనికి కారణం పేరున్న సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఫీజులు మామూలుగా లేవు.
నా అంచనా ప్రకారం చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం సరైన ప్రణాళికలు లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎంత రాబడి వస్తుంది, అది మన పిల్లలకు చదువుకు అక్కరకు వస్తుందా...లేదా! అన్న వాటితో సంబంధం లేకుండా ఎవరో చెప్పారని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
గతంలో మాదిరి పిల్లల చదువులకు డబ్బులు సమకూర్చుకోవడం అంత సులువేమీ కాదు. ఇప్పుడు పరిస్థితులు చాలావరకూ మారాయి. చదువుల్లో పోటీ బాగా పెరిగింది. అలాగే విద్యావ్యయాలు కూడా బాగా పెరిగిపోయాయి. మంచి సంస్థల్లో సీటు పొందడానికి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంతటి భారీ వ్యయంతో కూడుకున్న చదువుకు సరైన ప్రణాళిక లేక చాలామంది తల్లిదండ్రులు చదువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది వారి పొదుపు, ఇతర భవిష్యత్తు ఆర్థిక అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.
ఇవి ఆలోచించారా?
ఇతర ధరల పెరుగుదలతో పోలిస్తే విద్యావ్యయం మరింత వేగంగా పెరుగుతోంది. ఎంత వేగంగా అంటే... జీతాలు ఏ మూలకూ సరిపోనంత. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీటికి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. మీ అవసరానికి తగినట్టుగా ఉన్న బీమా పథకాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం ఈ అంశాలను పరిశీలించండి.
- ఇంటర్ పూర్తయ్యాక పిల్లలకు కీలకమైన ఉన్నత చదువులు ప్రారంభమవుతాయి. అంటే పిల్లలకు 17-18 ఏళ్లు వస్తాయి. అప్పటికి నగదు చేతికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కాబట్టి పిల్లలకు 17 ఏళ్లు వచ్చే వరకు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.
- ఉన్నత చదువుల కోసం ఎంత మొత్తం దాచాలన్నది కీలకమైన ప్రశ్న. దీన్ని లెక్కించడానికి అనేక అంశాలను పరిశీలించాలి. అవసరమైతే నిపుణులైన ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ను సంప్రదించండి. సాధారణంగా ఇప్పుడున్న విద్యావ్యయం 10 ఏళ్లకి రెట్టింపు అవుతుందని ఒక లెక్క. దీని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోండి. లేకుంటే జీతంలో 5-10 శాతం పిల్లల చదువుకోసం పొదుపు చేయండి.
- ఇంటర్‌లోపు చదువు వరకు అయ్యే వ్యయాలను మీ నెలవారీ ఇంటి ఖర్చుల్లోకి లెక్కించుకోవాలి. ఇంటర్ తర్వాత నుంచి ఫీజులు బాగా పెరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా నిధిని సమకూర్చుకోవాలి. ఇందులో మీ పిల్లలు ఎంచుకునే కోర్సును బట్టి కూడా ఎంత మొత్తం, ఎంత కాలానికి అవసరమవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గ్రాడ్యుయేషన్ అనేది మూడు నుంచి ఐదేళ్లు ఉంటుంది.
మునీష్ షర్దా
ఫ్యూచర్ జెనెరాలీ లైఫ్ ఇన్సూరెన్స్