హైదరాబాద్ సదస్సుపై మోడీ వేగుల ఆరా!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ రథసారథి నరేంద్రమోడీ ఈనెల 11వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన సదస్సు తీరుతెన్నులపై ఆయన వేగులు ఆరా తీస్తున్నారు. ‘ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ’ పేరుతో కొందరు ఐటీ నిపుణులు హైదరాబాద్‌లో వివిధ వర్గాలను కలిసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బీజేపీ జాతీయ కోశాధికారి పీయూష్ గోయల్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన బాధ్యుడు రాజేష్‌జైన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్ కిరణ్, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డిని ఆది వారం కలిసి ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక మీడియాలో సంధించే ప్రశ్నలకు నరేంద్ర మోడీ జవాబు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. హైదరాబాద్‌లో మోడీ సదస్సుకు ఇప్పటివరకు రెండు లక్షల ప్రతినిధి కార్డులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోనే 50 వేల కార్డులను యువతకు జారీ చేశారు.
మోడీ పర్యటన ఇలా..: వచ్చే ఆదివారం(11వ తేదీ) మధ్యాహ్నం జరిగే సదస్సులో పాల్గొనేందుకు మోడీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు యువ పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేశవ్ మోమోరియల్ స్కూల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భోజనానంతరం 3 గంటలకు ఎల్బీ స్టేడియం లో సభలో పాల్గొంటారు. తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో ప్రత్యేకంగా భేటీ అయి, రాత్రి 8.30 గంటలకు అహ్మదాబాద్ వెళతారు. కాగా.. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి భూంరావ్ ఈనెల 8న బీజేపీలో చేరనున్నారు. ఆయన మోడీ సమక్షంలో చేరాలనుకున్నా అందుకు పార్టీ నేతల అనుమతి దొరకలేదు.