Fruit plant nurture
-
జీవ వైవిధ్యమే ప్రాణం!
‘గత డిసెంబరుతో (హైదరాబాద్ సమీపంలోని నారపల్లిలోని) మా మిద్దెతోట తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మార్కెట్లో కూరగాయలు కొనలేదు – పండ్లు కొనలేదు! మిద్దెతోటలోనే ఉత్పత్తి చేశాం! ఎనిమిది సంవత్సరాల మిద్దెతోట ఉత్పత్తిని – రోజుకు కిలో చొప్పున లెక్కించినా – మూడు టన్నుల పైమాటే! ఇదంతా కేవలం 1240 స్క్వేర్ ఫీట్ల టెర్రస్ మీద మాత్రమే పండించాం. ఎనిమిది సంవత్సరాల క్రితం మిద్దెతోట నిర్మాణ వ్యయం ఇరవై వేల రూపాయలు. అయితే, ఈ ప్రత్యక్ష ఫలితాల గురించి కాదు నేను చెప్పాలనుకుంటున్నది.. అది అందరికీ కనిపించే విషయమే! ఈ ఉత్పత్తి వెనుక ఒక సహజసిద్ధమైన ‘జీవ వైవిధ్య ప్రభావం’ ప్రక్రియ ఉన్నదని తెలియ జెప్పాలన్నదే ఈ ప్రయత్నం. అదే లేకుంటే, ఈ ఉత్పత్తి వచ్చేదే కాదు! జీవ వైవిధ్యం వల్లనే ప్రకృతి కొనసాగుతున్నది. మనందరికీ తెలుసు, పరపరాగ సంపర్కం వల్లనే పువ్వులు ఫలిస్తాయని. తేనెటీగలు సీతాకోకచిలుకలు ఇతర రెక్కల పురుగులు అందుకు దోహదపడతాయి. పూలలోని తేనె కోసం తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలినప్పుడు వాటి కాళ్ల నూగుకు పువ్వుల పుప్పొడి అంటుకుని.. అలా పరపరాగ సంపర్కం అప్రయత్నంగా జరుగుతుంది. అలా పువ్వులు ఫలదీకరణ చెందుతాయి. మనకు లభించే దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులు ఇలానే పండుతాయి. మిద్దెతోటను మనం అభివృద్ధి చేస్తున్నకొద్దీ, రావలసిన జీవజాతులు వచ్చి చేరతాయి. మిద్దెతోటల్లో పండ్ల మొక్కలను కూడా పెంచడం వల్ల పక్షులు కూడా వస్తాయి. చిన్న చిన్న పక్షులు మొక్కల మీద పురుగులను ఏరుకొని తింటాయి! మొక్కలకు హాని చేసే క్రిమికీటకాలను అలా కంట్రోల్ చేస్తాయి. కోయిలలు కూడా పండ్ల కోసం మిద్దెతోటల లోకి వస్తాయి. వాటి పాటలను వినగలగడం వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది మన స్వయం కృషి ఫలమైన సహజ సంగీతం! మట్టిలో వానపాములు అభివృద్ధి అవుతాయి. వాటివలన సహజసిద్ధమైన ఎరువు తయారు అవుతుంది. మిద్దెతోటలో సంవత్సరం పొడవునా పువ్వు లుండేలా పూల మొక్కలను పెంచుతాం కనుక రంగురంగుల సీతాకోక చిలుకలు మిద్దె తోటలోకి వస్తాయి, తేనె తాగడానికి! తద్వారా పువ్వుల మధ్య పరపరాగ సంపర్కం జరిగి మనకు సంపూర్ణ ఉత్పత్తి వస్తుంది. గువ్వలు, పిచ్చుకలు వచ్చి మిద్దెతోటలో గూళ్లు కట్టుకుంటాయి. మిద్దెతోటల మొక్కలకు హాని చేసే పురుగూ పుట్రలను అవి తినేస్తూ మొక్కలకు పరోక్షంగా రక్షణ కలిగిస్తాయి. మిద్దెతోటల్లోకి ఎలుకలు కూడా వస్తాయి.. నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకల కోసం పిల్లులు వస్తాయి. ఇలా ఇప్పుడు మా మిద్దెతోటలో మూడు పిల్లులు ఉన్నాయి. ఒక పెంçపుడు శునకం ఉంది. వాటి మధ్య సఖ్యత కూడా కలిగింది! మిద్దెతోటలో నిత్యం పూసే పువ్వుల తేనె కోసం వందలాది తేనెటీగలు ఉదయం పూట వస్తాయి. మిద్దెతోటలో చిన్నచిన్న తేనెపట్టులు పెట్టుకుంటాయి. ప్రతీ చిన్న పువ్వు నుండి అవి తేనెను గ్రహిస్తాయి. కూరగాయ మొక్కల పువ్వుల నుండి కూడా తేనెను గ్రహిస్తాయి. ఆ ప్రక్రియ వల్లనే నిజానికి సమస్త రకాల పువ్వులు ఫలదీకరణం చెందుతున్నాయి. మనం నిత్యం తినే తిండి తయారీలో తేనెటీగల పాత్ర అపురూపమైనది – వెలకట్టలేనిది! మనం ప్రకృతి సమతుల్యతను కాపాడితే, అది మన ఆయురారోగ్యాలను కాపాడుతుంది! మిత్రుడు క్రాంతిరెడ్డి ఓ మాట అన్నాడు, ‘నేను మాత్రమే అనుకుంటే అహం – నేను కూడా అనుకుంటే సుఖం. మనుషులొక్కరే భూగోళం మీద మనలేరు – సమస్త జీవజాతుల మనుగడలో మనుషుల మనుగడ ముడిపడి ఉంది! పట్టణాలలో జీవ వైవిధ్యం పెరగాలంటే, మిద్దెతోటలను మించిన సాధనాలు లేవు! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు, నారపల్లి రఘోత్తమరెడ్డి మిద్దె తోటలో జీవవైవిధ్యానికి ఆనవాళ్లు.. పక్షి గూళ్లు, పక్షులు, పిల్లి, కుక్క.. -
మొక్కల పేర...మెక్కేశారు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లావ్యాప్తంగా డ్వామా ఆధ్వర్యంలో ‘పండ్ల మొక్కల పెంపకం’ పథకం అమలవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తంగా 6070 మంది లబ్ధిదారులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 14,447 ఎకరాల విస్తీర్ణంలో ఈ రైతులకు చెందిన తోటల్లో పండ్ల మొక్కల పెంపకానికి అవసరమైన సాయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అధికారిక సమాచారం మేరకు పండ్ల మొక్కలు నాటేందుకు 5330 గుంతలు తవ్వారు. దీనికోసం ఏకంగా రూ.2.89కోట్లు ఖర్చు చేశారు. 695మంది రైతులు తమ పరిధిలోని 1483 ఎకరాల్లో మొక్కలు నాటారు. కాగా, ఈ మొక్కలకు ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ.1.72 లక్షలుగానే చూపిస్తున్నారు. ఇంత వరకులెక్కలు సరిగానే కనిపిస్తున్నా, అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. పండ్ల తోటలు సాగుచేసే రైతుల కోసం ఒక ఎకరాకు బత్తాయి, నిమ్మ మొక్కలయితే 110, మామిడి మొక్కలు అయితే 70 చొప్పున సబ్సిడీ కింద ఇస్తున్నారు. బత్తాయి, నిమ్మ మొక్కలకు ఒక్కో మొక్కకు రూ.12, మామిడి మొక్కలకు ఒక్కోదానికి రూ.23.50 చెల్లిస్తున్నారు. గతంలో కడప జిల్లా రైల్వేకోడూరు నుంచి ఈ మొక్కలను దిగుమతి చేసుకునేవారు. మొక్కల ట్రాన్స్పోర్టు కోసం ఒక్కో మొక్కకు రూ.3 నుంచి రూ.4.85 దాకా చెల్లించేవారు. అయితే, రాష్ట్ర విభజన జరిగాక స్థానికంగా ఉన్న నర్సరీల్లోనే మొక్కలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు రైతులకు సూచించారు. కానీ కిందిస్థాయిలో ఉండే ఏపీఓ స్థాయి అధికారులు కొందరు రైతులను పక్కదారి పట్టిసున్నారు. తమ వ్యాపారం జోరుగా సాగేందుకు బినామీలుగా మారి ఏకంగా నర్సరీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే నర్సరీల్లో మొక్కలు బలంగా లేవని, తాము సూచించిన నర్సరీల్లోనే మొక్కలు కొనాలని కండీషన్ పెడుతున్నారు. అధికారులే చెబుతున్నారు కాబట్టి రైతులు కూడా వారి సూచించిన నర్సరీల్లోనే మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ నర్సరీలో మొక్కలకు విపరీతమైన ధరలు పెట్టారు. రూ.30 నుంచి రూ.50 దాకా ఒక్కో మొక్కకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో రైతుల జేబుకు చిల్లు పడుతోంది. ఏ నర్సరీలో మొక్కలు కొనుగోలు చేసినా, రైతుల తోటల వరకు తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ, అదేమీ జరగడం లేదు. కాకుంటే కొందరు ఏపీఓలు మాత్రం రైతులకే చెందాల్సిన ట్రాన్స్పోర్టు బిల్లులు కూడా కాజేస్తున్నారు. ఏపీఓలు సొంతంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మంచి మొక్కల పేరున అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకు అదనంగా ఒక్కో మొక్కకు రూ.30 దాకా రైతులు జేబు నుంచి ఖర్చవుతోంది. ఇప్పటి దాకా నాటిన మొక్కలకు కనీసం రూ.30 లక్షల దాకా ఇదే తరహాల్లో రైతుల జేబుకు చిల్లు పడగా, కొందరు ఏపీఓల జేబులు మాత్రం నిండాయి. రైల్వే కోడూరుకు చెందిన నర్సరీల బ్రాంచ్లుగా చెప్పుకుంటూ నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. కొన్ని బిల్లులు రైతుల పేరున ఇస్తుండగా, మరికొన్ని బిల్లులు గ్రామ పంచాయతీల పేరు మీద ఇస్తున్నారు. పంచాయతీల పేరున ఎందుక బిల్లులు ఇస్తున్నారో అర్థం కానీ పరిస్థితి. సూర్యాపేట సమీపంలోని ఓ నర్సరీలో ఇదే తరహాల్లో అక్రమదందా సాగుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు ఏపీఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అసలు లేని నర్సరీ పేరున కూడా బిల్లులు సృష్టిం చారు. మొత్తానికి కొందరు ఏపీఓలు అటు ప్రభుత్వ సొమ్ముతో పాటు, రైతుల సొంత డబ్బులకూ చిల్లు పెడు తున్నారు.