మొక్కల పేర...మెక్కేశారు! | Fruit plant nurture scheme | Sakshi
Sakshi News home page

మొక్కల పేర...మెక్కేశారు!

Published Sun, Sep 28 2014 3:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

మొక్కల పేర...మెక్కేశారు! - Sakshi

మొక్కల పేర...మెక్కేశారు!

 సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లావ్యాప్తంగా డ్వామా ఆధ్వర్యంలో ‘పండ్ల మొక్కల పెంపకం’ పథకం అమలవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తంగా 6070 మంది లబ్ధిదారులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 14,447 ఎకరాల విస్తీర్ణంలో ఈ రైతులకు చెందిన తోటల్లో పండ్ల మొక్కల పెంపకానికి అవసరమైన సాయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అధికారిక సమాచారం మేరకు పండ్ల మొక్కలు నాటేందుకు  5330 గుంతలు తవ్వారు. దీనికోసం ఏకంగా రూ.2.89కోట్లు ఖర్చు చేశారు. 695మంది రైతులు తమ పరిధిలోని 1483 ఎకరాల్లో మొక్కలు నాటారు. కాగా, ఈ మొక్కలకు ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ.1.72 లక్షలుగానే చూపిస్తున్నారు. ఇంత వరకులెక్కలు సరిగానే కనిపిస్తున్నా, అసలు కిటుకంతా ఇక్కడే ఉంది.
 
 పండ్ల తోటలు సాగుచేసే రైతుల కోసం ఒక ఎకరాకు బత్తాయి, నిమ్మ మొక్కలయితే 110, మామిడి మొక్కలు అయితే 70 చొప్పున సబ్సిడీ కింద ఇస్తున్నారు. బత్తాయి, నిమ్మ మొక్కలకు ఒక్కో మొక్కకు రూ.12, మామిడి మొక్కలకు ఒక్కోదానికి రూ.23.50 చెల్లిస్తున్నారు. గతంలో కడప జిల్లా రైల్వేకోడూరు నుంచి ఈ మొక్కలను దిగుమతి చేసుకునేవారు. మొక్కల ట్రాన్స్‌పోర్టు కోసం ఒక్కో మొక్కకు రూ.3 నుంచి రూ.4.85 దాకా చెల్లించేవారు. అయితే, రాష్ట్ర విభజన జరిగాక స్థానికంగా ఉన్న నర్సరీల్లోనే మొక్కలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు రైతులకు సూచించారు. కానీ కిందిస్థాయిలో ఉండే ఏపీఓ స్థాయి అధికారులు కొందరు రైతులను పక్కదారి పట్టిసున్నారు. తమ వ్యాపారం జోరుగా సాగేందుకు బినామీలుగా మారి ఏకంగా నర్సరీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే నర్సరీల్లో మొక్కలు బలంగా లేవని, తాము సూచించిన నర్సరీల్లోనే మొక్కలు కొనాలని కండీషన్ పెడుతున్నారు.
 
 అధికారులే చెబుతున్నారు కాబట్టి రైతులు కూడా వారి సూచించిన నర్సరీల్లోనే మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ నర్సరీలో మొక్కలకు విపరీతమైన ధరలు పెట్టారు. రూ.30 నుంచి రూ.50 దాకా ఒక్కో మొక్కకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో రైతుల జేబుకు చిల్లు పడుతోంది. ఏ నర్సరీలో మొక్కలు కొనుగోలు చేసినా, రైతుల తోటల వరకు తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ, అదేమీ జరగడం లేదు. కాకుంటే కొందరు  ఏపీఓలు మాత్రం రైతులకే చెందాల్సిన ట్రాన్స్‌పోర్టు బిల్లులు కూడా కాజేస్తున్నారు. ఏపీఓలు సొంతంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మంచి మొక్కల పేరున అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకు అదనంగా ఒక్కో మొక్కకు రూ.30 దాకా రైతులు జేబు నుంచి ఖర్చవుతోంది.
 
 ఇప్పటి దాకా నాటిన మొక్కలకు కనీసం రూ.30 లక్షల దాకా ఇదే తరహాల్లో రైతుల జేబుకు చిల్లు పడగా, కొందరు  ఏపీఓల జేబులు మాత్రం నిండాయి. రైల్వే కోడూరుకు చెందిన నర్సరీల బ్రాంచ్‌లుగా చెప్పుకుంటూ నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. కొన్ని బిల్లులు రైతుల పేరున ఇస్తుండగా, మరికొన్ని బిల్లులు గ్రామ పంచాయతీల పేరు మీద ఇస్తున్నారు. పంచాయతీల పేరున ఎందుక బిల్లులు ఇస్తున్నారో అర్థం కానీ పరిస్థితి. సూర్యాపేట సమీపంలోని ఓ నర్సరీలో ఇదే తరహాల్లో అక్రమదందా సాగుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు ఏపీఓలు  చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అసలు లేని నర్సరీ పేరున కూడా బిల్లులు సృష్టిం చారు. మొత్తానికి కొందరు  ఏపీఓలు అటు ప్రభుత్వ సొమ్ముతో పాటు, రైతుల సొంత డబ్బులకూ చిల్లు పెడు తున్నారు.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement