ఓటు.. ప్రగతికి రూటు..
జిల్లా ఓటర్లు 33,41,069
మహిళలు 16,81,361
పురుషులు 16,59,455
ఎన్నికల అనంతరం పెరిగిన ఓటర్ల సంఖ్య 1,64,983
మచిలీపట్నం : ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు ఓటు. నేతల తలరాతలు మార్చే శక్తి. అందుకే ఓటును వజ్రాయుధంతో పోలుస్తారు. ఓటు నమోదు కార్యక్రమాన్ని ఓ ప్రహసనంగా నిర్వహిస్తారు. 2014 జనవరి ఒకటో తేదీ నాటికి మన జిల్లాలో 31,76,086 మంది ఓటర్లు ఉండగా, 2015 జనవరి 17వ తేదీ నాటికి ఆ సంఖ్య 33,41,069కు చేరింది. ఇటీవల జరిగిన ఓటర్ల మార్పులు, చేర్పుల్లో 16 నియోజకవర్గాల్లో 1,64,983 మంది నూతనంగా ఓటుహక్కు పొందారు.
ఓటరు దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు
ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులు ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఓటుహక్కుపై డివిజన్ కేంద్రాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎక్కువసార్లు ఓటుహక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లను సత్కరించనున్నారు. నూతనంగా ఓటుహక్కు పొందిన వారికి గుర్తింపుకార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు.