బీజేపీ నుంచి నాకు ఆహ్వానం రాలేదు
నెలాఖరులో భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తా
శ్రీరాములు స్పష్టీకరణ
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరాలని ఆ పార్టీ నుంచి ఏ విధమైన ఆహ్వానం నాకు రాలేదని బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాపకులు బీ.శ్రీరాములు స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ పార్టీలోకి చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు, పార్టీ నేతలతో ఈ నెలాఖరులో సమావేశ పరిచి చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ విషయంలో మాజీ సీఎంలు జగదీశ్ శెట్టర్, డీవీ.సదానందగౌడలను తాను సంప్రదించాననడం ఊహాగానాలేనన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కేజేపీని బీజేపీలోకి విలీనం చేయడం మంచి నిర్ణయమన్నారు. దేశానికి సమగ్రత, శాంతి, సౌహార్ద్రత, ప్రామాణిక పాలన అందించేందుకు నరేంద్రమోడీ ప్రధాని కావడం అవసరమన్నారు. దేశం సుభద్రంగా ఉండాలనేదే తమ ఆశయమన్నారు.
హంపి ఉత్సవాల ఏర్పాట్ల ముందస్తు సమావేశం గురించి తనకు ఎవరూ తెలియజేయలేదన్నారు. గతంలో దివంగత ఎంపీ ప్రకాష్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ పరిగణనలోకి తీసుకుని ఉత్సవాలు చేపట్టామని గుర్తు చేశారు. అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా మంత్రిగాని, అధికారులు గాని తమకు ఆహ్వానం పంపలేదన్నారు. జిల్లాలో కరువు సమీక్షపై కూడా తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు.