ఇష్టమైతే అమ్మండి.. లేదంటే మీ ఇష్టం
మేమిచ్చేదింతే..!
గజ్వేల్: మేమిచ్చే ధర ఇది... ఇష్టమైతే అమ్మండి.. లేదంటే మీ ఇష్టం...అంటూ వ్యాపారులంతా ఒక్కటై రైతన్నలను దగా చేసేందుకు ప్లాన్ వేశారు. అంతేకాకుండా ఏకంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో అన్నదాతలు ఆగ్రహించారు. వెంటనే కొనుగోళ్లను చేపట్టడంతో పాటు గతంలో ఇచ్చిన ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన గురువారం గజ్వేల్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తతకు దారి తీసింది.
పత్తి రైతులు రోజూలాగే గజ్వేల్ యార్డుకు పత్తిని తీసుకొని వచ్చారు. కానీ యార్డులో వ్యాపారులు దుకాణాలు తెరిచినా, కొనుగోళ్లు చేయకుండా కూర్చుండిపోయారు. రైతులు ఆరా తీస్తే ‘‘పత్తి ధర బాగా పడిపోయింది...మేం చెప్పిన ధరకైతే కొనుగోలు చేస్తం...లేదంటూ మీ ఇష్టం’’ అంటూ చేతులెత్తేశారు.
నిజానికి నిన్నటి వరకు క్వింటాలు పత్తికి రూ.3,700 నుంచి రూ.3,900 వరకు చెల్లించిన వ్యాపారులు గురువారం మాత్రం రూ.3000 నుంచి రూ.3500 మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు యార్డు పక్కనే ఉన్న గజ్వేల్-తూప్రాన్ రహదారిపై బైఠాయించి ట్రేడర్ల తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల రాస్తారోకో కారణంగా రాకపోకలకు 40 నిమిషాలకు అంతరాయం కలిగింది. రైతుల ఆందోళనకు గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య కూడా మద్దతు పలికారు. విషయం సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఎస్ఐ జార్జి సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు.
యార్డులో కొనుగోళ్లు జరిగేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అనంతరం రైతుల ఆందోళన విరమింపజేసి వారితో కలిసి యార్డుకు వెళ్లారు. మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టి, ఇతర వ్యాపారులతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లను నిన్నటి మొన్నటిలాగే క్వింటాలుకు రూ.3,700 పైగా చెల్లించాలని సూచించారు. దీంతో వ్యాపారులు లావాదేవీలు ప్రారంభించడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. రైతులు తెస్తున్న పత్తిలో తేమ శాతం ఎక్కువగాఉండటం వల్ల ధర ఎక్కువ చెల్లించలేమని వ్యాపారులు వాదించడం గమనార్హం.
ఇష్టమొచ్చినట్లు చేస్తుండ్రు..
కూలోళ్లకు ఇయ్యనీకి పైసల్లేక మూడు క్వింటాళ్ల పత్తి అమ్ముదామని ఈడికి వచ్చిన. సేట్లు ఇష్టమొచ్చినట్లు చేస్తుండ్రు. ముందుగల్ల అసలే పత్తి కొనుగోలు జేయమన్నరు. కొందరు మేం చెప్పిన రేటుకు ఇస్తే కొంటమన్నారు. గిదేం పద్ధతి..? కష్టం చేసుకొని బతికే రైతులను ముంచుతరా..? ఇప్పటికైన ఈడ కొనుగోళ్లు సరిగా జరిగేటట్టు సూడాలె.
-తలకొక్కుల సత్యనారాయణ, రైతు, తిమ్మాపూర్, జగదేవ్పూర్ మండలం
మస్తు దుఃఖమొస్తుంది
ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తిని ఇక్కడికి తెస్తే ధర సరిగా వస్తలేదు. సేట్లు సక్రమంగా కొనక సతాయిస్తుండ్రు. ఇవన్నీ జూస్తే మస్తు దుఃఖమొస్తుంది. ఇప్పటికైనా గజ్వేల్ యార్డులో పత్తి తేంగానే కిరికిరి పెట్టకుండా కొనేటట్టు చేయాలె.
-బ్యాగరి శ్రీను, రైతు, రాయపోల్, దౌల్తాబాద్ మండలం
11జీజేడబ్ల్యూ01, 01ఎః గజ్వేల్లో వ్యాపారులు తీరుకు నిరసనగా పత్తి రైతుల రాస్తారోకో దృశ్యం.
11జీజేడబ్ల్యూ01బీ, 01సీః గజ్వేల్ యార్డులో పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయిన దృశ్యం.
11జీజేడబ్ల్యూ01డీః తలకొక్కుల సత్యనారాయణ.
11జీజేడబ్ల్యూ01ఈః బ్యాగరి శ్రీను.