ఆప్తబంధువు ఎల్ఐసీ
జీవిత బీమా సంస్థ అన్ని వర్గాల ప్రజలకు ఆప్త బంధువులా నిలిచిందని ఎస్పీ నవీన్ గులాఠీ అన్నారు. కడప నగరంలోని నేక్నామ్ ఖాన్ కళాక్షేత్రంలో జరిగిన బీమా ముగింపు ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.
కడప కల్చరల్ : జీవిత బీమా సంస్థ అన్ని వర్గాల ప్రజలకు ఆప్త బంధువులా నిలిచిందని కడప ఎస్పీ నవీన్ గులాఠీ అన్నారు. బీమా ముగింపు ఉత్సవాలు ఆదివారం కడప నగరంలోని నేక్నామ్ఖాన్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎల్ఐసీలో పాలసీ తీసుకుంటే జీవితానికి ఆదరువుగా నిలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్లతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సంస్థ సహాయకారిగా నిలవడం అభినందనీయమన్నారు. సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ జి.బాబురావు మాట్లాడుతూ వారోత్సవాల్లో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు.
మార్కెటింగ్ మేనేజర్ మునికృష్ణయ్య సంస్థ ఆవిర్భావం, ప్రస్తానం గురించి వివరించారు. ఎస్డీఎం బాబురావు ఎస్పీ గులాఠీకి జ్ఞాపికను అందజేశారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులు, ఉద్యోగులకు బహుమతులను అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.