బొమ్మ తుపాకీ చూపి.. బ్యాంక్ దోపిడీ
బెర్లిన్: 16 ఏళ్ల కుర్రాడు తెలివిమీరాడు. పెడదారి పట్టి పోలీసులకు పట్టుబడ్డాడు. బొమ్మ తుపాకీ చూపించి బ్యాంక్ సిబ్బందిని బెదిరించాడు. దర్జాగా లూటీ చేసి బైక్ మీద ఉడాయించాడు. పొరుగు దేశానికి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన జర్మనీలో జరిగింది.
దక్షిణ జర్మనీ ప్రాంతంలోని బవారియన్ పట్టణంలో గత వారం ఓ కుర్రాడు బ్యాంక్ లోకి ప్రవేశించాడు. ఆడుకునే తుపాకీ చూపించి బెదిరించడంతో బ్యాంక్ సిబ్బంది చేతులు పైకెత్తి హడలెత్తిపోయారు. దొంగకు కొంత సొమ్ము అప్పగించారు. అనంతరం పొరుగు దేశం ఆస్ట్రియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దేశ సరిహద్దు వరకు వెళ్లగలిగాడు. అయితే బోర్డర్ దాటుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మ తుపాకీతో బ్యాంక్ ను దోచుకున్నట్టు ఆ కుర్రాడు పోలీసులకు చెప్పాడు.