ప్రాణం తీస్తున్న పాపం
అడగకుండానే ఆకలి పేగులకు అన్నం ముద్దయ్యేఅమృతమూర్తి అమ్మ కూడా ఓ ఆడపిల్లే..కష్టాల సగాన్ని కడుపులో దాచుకుని.. ఆనందాలసగాన్ని కట్టుకున్నోడికి పంచే ఆలి కూడా ఓ ఆడపిల్లే..
చిన్నతనంలో ఆటపాటల్లో, అల్లరిచేష్టల్లో అంతులేనిఅనురాగం పంచే సోదరి కూడా ఓ ఆడపిల్లే...మళ్లీ జన్మంటూ ఉంటే నవమాసాలు మోసి పురిటినొప్పులబాధనోర్చి నిన్ను పుట్టించేదీ ఓ ఆడపిల్లే..
నేడు ఈ ఆడపిల్ల అమ్మగర్భంలో ఆయుష్షు పోసుకోకముందేఅనాగరికపు కత్తిపోట్లకు కరిగిపోతోంది.లింగ నిర్ధారణ పరీక్షలతో రేపటి సమాజాన్ని అమ్మ లేని మట్టి బొమ్మను చేస్తోంది.
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ మొగ్గలోనే తుంచేస్తున్నారు. మరికొందరు పుట్టిన గంటల వ్యవధిలోనే ముళ్ల కంపల్లో , చెత్త కుండీల్లో, కాలువల్లో విసిరేస్తూ మానవత్వాన్ని మంట కలుపుతున్నారు. ఇటీవల పుట్టినరోజే శిశువును కాల్వలో వేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. చెత్తకుప్పల్లో, కాలువల్లో దొరుకుతున్న శిశువులంతా ఆడపిల్లలు కావడం విశేషం.
సమానం కాదా ?
ఏటా బాలిబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం పెరుగుతూనే ఉంది. రెండు జిల్లాల్లోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక స్కానింగ్ సెంటర్లలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అందుకు రెండు జిల్లాల్లో వెల్లడైన పలు కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు, బాలికల పట్ల వివక్షను పోగేట్టుందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితాలు ఇవ్వడం లేదు.
స్కానింగ్ ఎవరు చేయాలి ?
రేడియాలజీలో డిప్లొమాగానీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌గానీ చేసినవారు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌కు అర్హులు. గర్భంలో శిశువు ఆరోగ్యం తెలుసుకోవడంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కీలకం. స్వల్పకాలిక శిక్షణ పొందిన గైనకాలజిస్ట్లు, టెక్నీషియన్లు స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో మైలవరం, నందిగామ ప్రాంతాల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఉదాహరణలివీ
♦ పిడుగురాళ్లలో స్కానింగ్ సెం టర్ను రిజిస్టరు చేయించుకోకుండా స్కానింగ్‌లు చేయిస్తున్నట్లు గుర్తించి 2012లో కేసు నమోదు చేశారు. చట్టప్రకారం ప్రతి స్కానింగ్ సెంటర్
డీఎంహెచ్ఓ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలి.
♦ రెండున్నరేళ్ల క్రితం గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన మహిళకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, మగపిల్లల కోసం ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఆమెకు గర్భం రాగా లింగ నిర్ధారణలో ఆడపిల్లని తేలింది. దీంతో కడుపులోనే చిదిమేశారు.
కఠిన చర్యలు తప్పవు
స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించి చెప్పడం చట్టరీత్యా నేరం. నిబంధనలు అతిక్రమిస్తే ఆయా సెంటర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గుంటూరు జిల్లాలో ఇప్పటికే రెండు స్కానింగ్ సెంటర్లపై కేసులు నమోదై కోర్టు విచారణలో ఉన్నాయి. నిత్యం స్కానింగ్ చేసిన వెంటనే ఆన్లైన్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయానికి నివేదిక అందించాల్సి ఉంది. – డాక్టర్ జె.యాస్మిన్, డీఎంహెచ్ఓ, గుంటూరు జిల్లా.