కస్తూరిబాలో ఆకలి కేకలు
* వాడరేవు కస్తూరిబా పాఠశాలలో అర్ధాకలితో విద్యార్థినులు
* నెల రోజులుగా నిలిచిన సరుకుల పంపిణీ
* రూ.4 లక్షల అద్దె బకాయి..
* అసౌకర్యాల నడుమ బాలికల అవస్థలు
చీరాల: ఆ పాఠశాలలో చదువుతున్న బాలికలు పస్తులతో పోరాటం చేస్తున్నారు. కొద్ది నెలలుగా అల్పాహారం మొహం కూడా చూడలేదు. సాయంత్రం వేళ పెట్టే స్నాక్స్ అంటే వారికి తెలియదు. అరకొరగా పెట్టే భోజనంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిర్వహణ కోసం వస్తున్న లక్షలాది రూపాయలు అక్రమార్కుల పరమవుతున్నాయి.
* మండలంలోని వాడరేవులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చీరాల, ఒంగోలు, కారంచేడు, పర్చూరు, నాగులుప్పలపాడు మండలాలకు చెందిన 139 మంది బాలికలు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. పది మంది టీచింగ్, 11 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్వో అక్రమాలకు పాల్పడటంతో విద్యాలయంలో చదువుతున్న బాలికలకు కష్టాలు మొదలయ్యాయి.
* సరుకులు సప్లై చేసే ఒంగోలు కో ఆపరేటివ్ సొసైటీకి కస్తూరిబా బాలికల విద్యాలయం గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.2.5 లక్షల బకాయిలు ఉండటంతో నెల నుంచి సరుకుల పంపిణీ నిలిపేశారు. సరుకుల కోసం వచ్చిన నిధుల్ని గతంలో పనిచేసిన ఎస్వో స్వాహా చేయడంతో జూన్, జూలై నెలలకు సంబంధించిన నగదు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. సరుకులు నిండుకోవడంతో అందులో పనిచేస్తున్న స్పెషలాఫీసర్ హమీదా బేగం గ్రామస్తులు, సిబ్బంది సాయంతో విద్యార్థులకు పట్టెడన్నం పెడుతున్నారు.
దీనికి తోడు వారం రోజుల క్రితం భవనం అద్దె బకాయిలు రూ.4 లక్షలు పైగా ఉండడంతో భవన యజమాని విద్యార్థినులను, సిబ్బందిని ఉన్నపళంగా బయటకు పంపి తాళం వేశారు. ఉన్నతాధికారుల హామీతో మళ్లీ తెరిపించారు. భవనం అద్దె బిల్లులు పైనుంచి వస్తున్నప్పటికీగతంలో ఉన్న ఎస్వో తన సొంతానికి వాడుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
* విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. 164 విద్యార్థినులు స్నానం చేసేందుకు కేవలం రెండు స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. వాటికి కూడా తలుపులు లేకపోవడంతో వేరే షెడ్డులో పరదాపట్ట కట్టుకుని స్నానం చేస్తున్నారు.
* కంప్యూటర్ విద్యనందించేందుకు ప్రభుత్వం 2012లో 5 కంప్యూటర్లను అందజేసింది. సంబందిన టీచర్ లేరనే కారణంతో ఆ కంప్యూటర్లను ఇంత వరకు ఉపయోగించనేలేదు.
* ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు రావల్సిన నిధులు విడుదల చేయాలని, విద్యార్థినులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రస్తుతం ఎస్వోగా పనిచేస్తున్న హమీదా బేగం కోరారు.