సుధాభరితం... గోదాచరితం!
తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అనీ అర్థం. స్వామిని మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆ స్వామిలో ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి
సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి భోగిపండుగ వరకు ఉండే మాసమే ధనుర్మాసం. వైష్ణవులు పరమ పావనంగా భావించే ఈ మాసంలో నిత్యమూ గోదాదేవి విరచిత ‘తిరుప్పావై’లోని పాశురాలను పారాయణ చేస్తారు. భూలోక వైకుంఠమై భాసించే తిరుమలలోనూ ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని గానం చేయడం అనూచానంగా వస్తోంది. గోదాదేవి అంటే సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. ఈమెనే వైష్ణవ సంప్రదాయంలో ఆండాళ్ అనీ, చూడికుడిత నాంచారి అనీ వ్యవహరిస్తారు.
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, భక్తి ప్రబంధాలలో పన్నిద్దరు ఆళ్వారులు సుప్రసిద్ధులు. వీరిలో పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుచిత్తుడు తన ఉదాత్త చరితంతో విష్ణుభక్తుల్లో శాశ్వత స్థానం పొందాడు. విష్ణుచిత్తుడు స్థానిక వైష్ణవ దేవాలయాల్లో స్వామికి పుష్పాలను, తులసిమాలలను కైంకర్యం చేస్తూ, శ్రీకృష్ణుని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు విష్ణుచిత్తుడికి తులసి మొక్కల మధ్య పవళించి బంగారు వర్ణంలో ఉన్న శిశువు కనిపించింది. భూమాత ప్రసాదించింది కాబట్టి ఆమెను గోదా నామంతో పిలుచుకుంటూ గారాబంగా పెంచాడు విష్ణుచిత్తుడు. ఈ గోదాకు అసలు నామం కోదై అని పండితుల ఉవాచ. కోదై అంటే సుమమాలిక అని అర్థం. గోదాదేవిని శ్రీకృష్ణుని పాదాల చెంతనే ఉంచి ఆమెలో భక్తిభావాలను చిన్ననాటి నుంచే చిగురింపజేశాడు. గోదాదేవి శ్రీవారికి సమర్పించే పూమాలలను కడుతుండేది. ఆ మాలలను భగవంతుడికి వినమ్రంగా సమర్పించేవాడు విష్ణుచిత్తుడు. గోదాదేవికి స్వామి మనోహరత్వాన్ని దర్శించాలనే కోరిక కలిగింది.
ఒకనాడు దేవాలయంలో జగన్మోహనాకారుడైన స్వామిని చూసి తన్మయురాలయింది. ఆ తరువాత స్వామివారికి సమర్పించే దండలను తాను ధరించి, తమ ఇంటిలో ఉన్న నూతిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. రానురానూ... తనకు, భగవంతునికి భేదం లేదని తలచి తన ఆత్మలోనే ఆ సర్వేశ్వరుణ్ణి త్రికరణశుద్ధిగా దర్శించింది.
ఒకనాడు విష్ణుచిత్తుడు స్వామికి సమర్పించే దండల్లో ఒక కేశపాశాన్ని చూసి గోదాదేవిని సందేహించి, తన అనుమానం నిజమేనని రూఢి చేసుకుని, ఒకరోజు గోదాదేవిని మందలించాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తన గారాలపట్టిని నిందించినందుకు వ్యాకులచిత్తుడై, గోదా ధరించిన మాలలను స్వామికి సమర్పించడం అపచారంగా భావించాడు. ఆనాడు ఆలయానికి వెళ్లకుండా, తన గృహంలోనే తీవ్ర ఆవేదనతో శయనించాడు విష్ణుచిత్తుడు. ఆయనకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, ‘‘విష్ణుచిత్తా! నీవు నాకు నిత్యం భక్తితో సమర్పించే మాలలను ఈ రోజు సమర్పించలేదేం?’’ అని ప్రశ్నించగానే, విష్ణుచిత్తుడు జరిగినదంతా స్వామికి విన్నవించాడు. దానికి పరమాత్మ చిరునవ్వుతో... ‘గోదా ధరించిన మాలలను అలంకరించుకోవడం నాకు అత్యంత ప్రీతిపాత్రం’ అనగానే విష్ణుచిత్తుడు పరమానంద భరితుడయ్యాడు. ఆరోజునుంచి శ్రీహరి సేవలో నిమగ్నమయ్యారు తండ్రీకూతుళ్లు.
గోదాకు యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చెయ్యాలన్న తన నిర్ణయాన్ని ప్రస్తావించాడు విష్ణుచిత్తుడు. శ్రీకృష్ణుని తప్ప పరపురుషుని తాను వరించనని గోదాదేవి తండ్రికి స్పష్టం చేసింది. కాత్యాయనీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, దీక్షతో ఆచరించిన గోపికలు ద్వాపరయుగంలో తమ మధురభక్తితో కమలాక్షుడైన శ్రీకృష్ణుని పొందారని తెలుసుకున్న గోదాదేవి తానూ ఆ స్వామి దేవేరిని కాగలనని విశ్వసించి, దృఢసంకల్పంతో కఠినమైన తిరుప్పావై దీక్షను ప్రారంభించింది.
తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అని అర్థం. తాను విరచించిన తిరుప్పావైలోని భావబంధురమైన 30 పాశురాలతో మధురభక్తినీ, హృదయ సమర్పణం చేసే అలౌకిక ప్రణ యాన్నీ రంగరించి, మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆయనలోనే ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి. పాశుర గీతికలతో స్వామిని కీర్తించి, ఆ పరంధామునికి ఆత్మనివేదన చేసిన కారణజన్మురాలు గోదాదేవి.
- వెంకట్ గరికపాటి