నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు!
నాసిరకంగా అమరేశ్వరుని లడ్డు ప్రసాదం
నిగ్గుతేల్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు
హైదరాబాద్కు నమూనాలు పంపిన అధికారులు
పట్నంబజారు (అమరావతి) : పంచారామాల్లో ఒకటైన అమరావతి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు లడ్డూల తయారీలో చేతివాటాన్ని ప్రదర్శించారు. నాసిరకం లడ్డూలు తయారుచేసి భక్తులకు ఒక్కొక్కటి పది రూపాయల చొప్పున అమ్మారు. దేవాదాయ శాఖ అధికారులు పుష్కరాలు 12 రోజులకు సరిపడా సుమారు 50 వేల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచారు. గడిచిన పది రోజుల్లో సుమారు 3 నుంచి 4 లక్షల లడ్డూలను విక్రయించారు. ఆహార భద్రత అధికారులు రెండు రోజుల క్రితం లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించి కంగుతిన్నారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా..లడ్డూలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం రూపాయి కూడా విలువ చేయని పదార్ధాలను వినియోస్తున్నారని సమాచారం. ఆహార భద్రత అధికారుల దాడుల నేపథ్యంలో అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ నేత ఫుడ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
అమరావతిలో లడ్డూ మాఫియా..?
స్థానికంగా కొంతమంది పెద్దల నేతృత్వంలో లడ్డూల మాఫియా జరుగుతోందని సమాచారం. ఎక్కడబడితే అక్కడ స్వామివారి ఫొటోతో ఉన్న కవర్లు తయారు చేసి బయట తయారు చేసిన లడ్డూలు అమ్ముతున్నారని తెలుస్తోంది. దీనిని నియంత్రించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖాధికారులపైనే ఉంది. కానీ పెద్దమొత్తంలో చేతులు తడుపుతుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.