సువర్ణ స్వరం మూగబోయింది
అలానాటి బాలీవుడ్ సింగర్ ముబారక్ బేగం మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. 50లలో గాయనిగా వెండితెరకు పరిచయం అయిన ఆమె దాదాపు మూడు దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీతానికి సేవలందించారు. ఆల్ ఇండియా రేడియో గాయనిగా, భక్తి గీతాల గాయనిగా, సినీ నేపథ్యగాయనిగా ఎన్నో రంగాలల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
లతా మంగేష్కర్ లాంటి ఉద్దండుల సమకాలీనురాలిగా పేరుతెచ్చుకున్న ముబారక్ బేగం.. దేవదాస్, మధుమతి, హమారీ యాద్ ఆయేగీ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్‌కు తన స్వరంతో మరింత అందాన్ని తీసుకువచ్చారు. 1980లో సినిమా పాటలకు దూరమైన ముబారక్ బేగం, తరువాత తన కుమారుడితో కలిసి ముంబైలో సెటిల్ అయ్యారు. 2015లో తన కూతురి మరణంతో కుంగిపోయిన ముబారక్ బేగం ఆరోగ్యం దెబ్బతింది.
అప్పటి నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె చివరి రోజుల్లో హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లెజెండరీ సింగర్‌గా లతా మంగేష్కర్, ఆశాబోంస్లే లాంటి వారికి పోటి ఇచ్చిన ఆమె, చివరి రోజుల్లో మాత్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడిన ముబారక్ బేగం మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖుల సంతాపం తెలియజేశారు.