దశలవారీగా ఉద్యమ కార్యాచరణ..
చినుకు చినుకు కలిసి మహా ప్రవాహంగా మారుతోంది.. చిన్న చిన్న ప్రవాహాలు కదిలి మహా సముద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి.. సమైక్యాంధ్ర కోసం సాగుతున్న ఉద్యమం ఉధృతరూపం సంతరించుకుంటోంది.. చిన్నగా మొదలైన జన ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది.. మేము సైతం అంటూ ప్రభుత్వ ఉద్యోగ వర్గం కూడా పథం కలుపుతూ మెరుపు సమ్మెకు సమాయత్తమైంది.. భారత జాతి విముక్తి కోసం ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్య్రం వస్తే సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి సకల జనుల సమ్మె ప్రారంభం కానుంది.
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర నినాదంతో జిల్లాలో సాగుతున్న ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమం మరో కీలక మలుపు తిరుగుతోంది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి జిల్లాలోని సుమారు 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఇప్పటివరకు స్వచ్ఛంద సంఘాలు, రాజకీయ నేతలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రజలతో మమేకమై అనేక రూపాల్లో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా ఎన్జీవోలు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మిగిలిన ఉద్యోగ వర్గాలు కూడా సమ్మెతో సమైక్యాంధ్ర నినాదాన్ని హోరెత్తించనున్నారు. జిల్లా అంతటా ఇప్పటికే ఉధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సైతం అంటూ ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి విధులు బిహ ష్కరించి సమ్మెబాట పట్టనున్నారు.
దశలవారీగా ఉద్యమ కార్యాచరణ..
జిల్లాలోని ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల ఉద్యోగులు సుమారు రూ.35 వేల మంది ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 12న జిల్లాలోని ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం ప్రకటించింది. 13 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నామని, 15న హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర కోసం బహిరంగ అవగాహన సభ నిర్వహించనున్నామని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు రెండు రోజుల క్రితం ప్రకటించారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, వీఏవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టే అవకాశం ఉంది. జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు 370 మంది, పంచాయతీ సిబ్బంది 1,200 మంది, వీఆర్వోలు సుమారు 900 మంది, వీఆర్ఏలు రెండువేల మంది ఉన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 1,274 మంది పర్మినెంట్ ఉద్యోగులు, మూడు నగర పంచాయతీల్లో సుమారు 150 మంది ఉద్యోగులు ఉండగా వీరంతా సమ్మెలో భాగస్వాములు కానున్నారు.
మున్సిపాలిటీల్లో పర్మినెంట్ ఉద్యోగులు మచిలీపట్నంలో 589 మంది, పెడనలో 30 మంది, గుడివాడలో 480 మంది, నూజివీడులో 130 మంది, జగ్గయ్యపేటలో 45 మంది ఉన్నారు. ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు సమ్మె బాట పడితే అటు పట్టణాల్లోను, ఇటు పల్లెల్లోను మంచినీరు, పారిశుధ్య నిర్వహణ వంటి సేవలకు సైతం అవాంతరం ఏర్పడే అవకాశం ఉంది.
ముందస్తు చర్యలేవీ?
సమైక్యాంధ్ర కోసం ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించినా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ముందస్తు ఆదేశాలూ రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సమ్మె మొదలైతే అప్పుడు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉద్యోగ వర్గాల సమ్మె సమయంలో ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వస్తే పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి చెప్పారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ముందస్తు ఆదేశాలేవీ రాలేదని, సమ్మె సమయంలో పరిస్థితికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఉద్యోగుల సమ్మె విషయంలో అప్పటి పరిస్థితిని కలెక్టర్‌తో చర్చించి ప్రజలకు పాలనాపరంగా ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎల్.విజయచందర్ చెప్పారు. పంచాయతీ ఉద్యోగులు తనకు సమ్మె నోటీసు ఇవ్వలేదని జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ చెప్పారు.
జిల్లాలోని పంచాయతీల్లో సిబ్బంది సమ్మెకు వెళుతున్నట్టు తనకు నోటీసు ఇస్తే దానిపై కలెక్టర్‌తో సమీక్షించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీరు, పారిశుధ్య నిర్వహణ వంటి అత్యవసర సేవలకు అవరోధం లేకుండా చూస్తానని డీపీవో వివరించారు. మున్సిపల్ ఉద్యోగులు కూడా తమకు సమ్మె నోటీసులు ఇవ్వలేదని జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకు వెళితే పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుందని అన్నారు. సమ్మె కారణంగా పట్టణాల్లో ప్రజలకు సేవలు అందించడంలో ఎటువంటి అసౌకర్యమూ కలగదని మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు.
అవనిగడ్డలో సమ్మెకు వెళ్లే అవకాశం లేదు..
జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్న అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే అవకాశం లేదని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి చెప్పారు. నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, ఘంటసాల మండలాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు విధిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప ఎన్నికలు ముగిసే వరకు అక్కడి ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.