‘జబర్దస్త్’ వేణుపై దాడి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న ‘జబర్దస్’్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు.
దీంతో కిందపడిపోయిన వేణు వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న ఫిలింనగర్ అవుట్‌పోస్ట్‌లో దూరాడు. గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూట రామారావు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ విద్యార్థులు ఫిలించాంబర్ వద్దకు చేరుకున్నారు. వేణు ప్రదర్శించిన స్క్రిఫ్ట్ వల్ల కోటి మంది గౌడ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు.
జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇరువురిపై కేసు నమోదు
తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.