నిర్లక్ష్యం నీడలో ‘ఆదర్శం’
నత్తనడకన పాఠశాల భవన నిర్మాణం
నాలుగేళ్లుగా కొనసాగుతున్న పనులు
అధికారుల పర్యవేక్షణ లోపం
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
షిప్టింగ్ పద్ధతిలో నష్టపోతున్న విద్యార్థులు
హత్నూర: ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం నాలుగేళ్లుగా నత్తనడకన కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మండలానికో ఆదర్శ పాఠశాల నిర్మించి మౌలికసదుపాయాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం మూలంగా పనులు ముందుకు సాగడం లేదు.
హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ శివారులో 3 కోట్ల పైచిలుకు నిధులను 2012-13 విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో అప్పటి మంత్రి సునీతారెడ్డి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో సదరు కాంట్రాక్టర్, అధికారులు, హడావిడి చేసి పిల్లర్ల స్థాయి వరకు పనులు చేసి వదిలేశారు.
రెండేళ్ళు గడిచిన ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. అనంతరం అధికారుల్లో కదలిక వచ్చి తిరిగి పనులు ప్రారంభించినా నాలుగేళ్ళు గడుస్తున్నా ఇప్పటికి స్లాబ్‌లెవల్ మాత్రమే పనులు పూర్తయ్యాయి. మూడు సంవత్సరాలుగా ఆదర్శ పాఠశాల ప్రారంభమైనా భవనం అసంపూర్తిగా ఉండడంతో హత్నూరలోని కస్తుర్బాగాంధీ పాఠశాలలో తరగతులు ప్రారంభించారు.
మూడేళ్ళుగా విద్యార్థులు షిప్టింగ్ పద్ధతిలోఒకే పూట మోడల్‌స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తు వస్తున్నారు. సౌకర్యాలు సరిపోను లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడో సంవత్సరం ఆదర్శపాఠశాలలో 415మంది విద్యార్థులు, 5నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువును కొనసాగిస్తున్నారు.
పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయించాలని పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి , అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరుతున్నారు.
షిప్టింగ్ పద్ధతితో నష్టపోతున్నాం
పాఠశాల భవనం పూర్తికాకపోవడంతో హత్నూరలోని కస్తుర్భాగాంధీ పాఠశాలల్లో షిప్టింగ్ పద్ధతిలో మధ్యాహ్నం వరకు తరగతులు బోధించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. - మహేష్, విద్యార్థి
త్వరగా నిర్మించాలి
ఆదర్శ పాఠశాల భవనం త్వరగా నిర్మాణం పూర్తిచేసి మా విద్యార్థులను అక్కడికి తరలించాలి. నత్తనడకన కొనసాగుతుండటం వల్ల విద్యార్థులందరం నష్టపోతున్నాం. పాఠశాల నిర్మాణం చేయాలని రాస్తారోకో సైతం చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. - బిందు, విద్యార్థిని
అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం
పాఠశాల భవనం లేక విద్యార్థులు నష్టపోతున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. త్వరగా సొంత భవనాన్ని నిర్మించి ఇస్తే విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్కడ సౌకర్యాలు సరిపోవడం లేదు. - మహమ్మద్‌రఫీ, ప్రిన్సిపాల్