గురజాల డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి
* యాదవ మహాసభ నేతల డిమాండ్
* కమిషన్ వేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ
గుంటూరు (పట్నంబజారు) : మాజీ శాసనసభ్యుడు, యాదవ కుల పెద్ద జంగా కృష్ణమూర్తిపై అమానుషంగా దాడి చేసిన గురజాల డీఎస్పీ కె. నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ్నాయక్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పోలీసులు పిలవగానే స్టేషన్‌కు వచ్చిన జంగాపై దాడి చేయటం దారుణమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డుపై ఆందోళన చేస్తుంటేనో..లేక ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, అవేమీ లేకుండా అకారణంగా చేయి చేసుకున్నారని తెలిపారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే దాడి చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ దాడి విషయం మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో పాటు కమిషన్ వేసి విచారిస్తామన్నారు. అనంతరం మహాసభ జిల్లా అధ్యక్షుడు మద్దుల కోటయ్యయాదవ్ మాట్లాడుతూ కమిషన్‌వేసి న్యాయం చేస్తామని ఎస్పీ చెప్పారని, ఆయనపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో యాదవ మహాసభ నేతలు ఏలికా శ్రీకాంత్‌యాదవ్, ఉప్పుటూరి పేరయ్య యాదవ్, యర్రాకుల తులసీరాం యాదవ్, రాజవరపు ఏడుకొండలు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, నారాయణపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.