ఎయిర్‌పోర్టు వ్వాపారంలో లాభాల స్వారీ
‘సాక్షి’ ఇంటర్వ్యూ: జీవీకే గ్రూప్ చైర్మన్, ఎండీ జి.వి. కృష్ణారెడ్డి
అప్పు తీర్చడానికి వీలైతే వాటా విక్రయిస్తాం
పెద్ద వాటాదారుగా మాత్రం మేమే కొనసాగుతాం
దీన్లో విస్తరణకు మరిన్ని బిడ్లు వేస్తాం
ఆస్ట్రేలియా బొగ్గు ఉత్పత్తి రెండేళ్లలో మొదలు
రాష్ట్రంలో విద్యుత్తుపై ప్రభుత్వ పాలసీ మారాలి
ఒప్పందం ప్రకారమే మేం పరిష్కార ఛార్జీలు అడుగుతున్నాం
రోడ్డు ప్రాజెక్టులేమీ లాభసాటిగా లేవు
అందుకే వాటినుంచి క్రమంగా వైదొలుగుతున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
జీవీకే గ్రూప్ నుంచి ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని విడదీసి కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు జీవీకే గ్రూపు సంస్థల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జి.వి.కృష్ణారెడ్డి తెలియజేశారు. వివిధ రంగాల్లో ఉన్న పరిస్థితుల వల్ల మొత్తంగా తమ గ్రూపు నష్టాలు కూడగట్టుకుంటున్నప్పటికీ ఎయిర్‌పోర్టుల వ్యాపారం మాత్రం లాభాల్లోనే ఉందని, అందుకే దాన్ని విడదీసే ఆలోచన ఉందని చెప్పారు. ముంబై విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్-2ను శుక్రవారం ప్రధాని జాతికి అంకితం చేసిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధితో కృష్ణారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిర్‌పోర్టుల నుంచి హోటళ్లు, రోడ్లు, పవర్ ప్రాజెక్టుల వరకూ తమ గ్రూపు పరిస్థితిని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
ముంబై టెర్మినల్-2ను అత్యుత్తమ నిర్మాణంగా చాలామంది చెబుతున్నారు కదా?
మేం ఒకటే అనుకున్నాం. ఒప్పందం ప్రకారం మాకింకా 60 ఏళ్లుంది. బహుశా! మా అబ్బాయి, మనవల తరం వరకూ మా చేతిలో ఉంటుందేమో!. కానీ ఈ కట్టడం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. మా గుర్తుగా. అందుకే దీన్నింత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాం.
ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఎలా ఉంది?
ముంబై, బెంగళూరు విమానాశ్రయాలతో పాటు ఇండోనేషియాలో మరో రెండు విమానాశ్రయాలున్నాయి. అక్కడి బాలి విమానాశ్రయంతో పాటు అంకాశపుర విమానాశ్రయానికి కూడా మేం సలహాదారుగా ఉన్నాం. ఎయిర్‌పోర్టుల వ్యాపారం లాభాల్లోనే ఉంది. దీన్ని మరింత కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
అంటే మరిన్ని విమానాశ్రయాల కోసం బిడ్లు వేస్తారా?
తప్పకుండా. నవీ ముంబాయి విమానాశ్రయానికి బిడ్లు పిలుస్తున్నారు. మేం ఈ విమానాశ్రయం చేశాం కనక మేం దానికి సహజంగానే అర్హులం. మిగతా వారైతే అర్హత సాధించాలి. మేం సాధిస్తే రెండూ మా చేతిలో ఉండటం వల్ల అందరికీ మంచిదే. ఇక దేశంలో మరో ఆరు విమానాశ్రయాల్ని ప్రైవేటీకరించడానికి బిడ్లు పిలిచారు. కానీ ఒక కంపెనీ రెండుకన్నా ఎక్కువ చేపట్టకూడదనే నిబంధన పెట్టారు. మేం బిడ్లు వేశాం. వచ్చేనెల్లో అర్హత ప్రతిపాదనలు పిలుస్తారు. అప్పుడు తేలుతుంది. కోల్‌కతా, చెన్నైలమీదే దృష్టిపెట్టాం.
ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయిస్తారా?
దీన్లో మాకున్న వాటాను 37 నుంచి 51కి పెంచుకున్నాం. అలాగే బెంగళూరు విమానాశ్రయంలో కూడా అతిపెద్ద వాటాదారుగా ఉండాలన్న ఉద్దేశంతో మా వాటాను 47కు పెంచుకున్న సంగతి మీకు తెలుసు. మొత్తమ్మీద ఎయిర్‌పోర్టుల వ్యాపారానికి 2,500 కోట్ల అప్పుంది. దీన్ని తగ్గించుకోవటానికి వాటా విక్రయించే అంశాన్ని పరిశీలిస్తాం. మే తరవాత మార్కెట్ బాగుంటే ఈ పని చేస్తాం. అయితే విక్రయం తరవాత కూడా మేమే అతిపెద్ద వాటాదారుగా ఉండేలా చూసుకుంటాం.
దీన్ని ప్రత్యేక వ్యాపారంగా చేసే ఆలోచన ఉందా?
ఎందుకు చేయకూడదు? ఇది లాభాల్లో ఉంది. మేం మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అవకాశాన్ని బట్టి దీన్ని ప్రత్యేక కంపెనీగా చేసే ఆలోచన కూడా ఉంది.
ఆస్ట్రేలియా బొగ్గుగనుల ఉత్పత్తి ఎప్పుడు మొదలు కావచ్చు?
అది చాలా పెద్ద ప్రాజెక్టు. అంచనా విలువ బాగా పెరిగి 10 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాం. అక్కడి రైల్వే మా భాగస్వామిగా ఉంది. అంతా సానుకూలంగానే ఉన్నారు. మరో రెండేళ్లలో బొగ్గు ఉత్పత్తి మొదలు కావచ్చని భావిస్తున్నాం.
రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితో...?
ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా చేస్తారన్న ఒప్పందం మేరకే ప్లాంటు పెట్టాం. దాన్ని సప్లయ్ చేయలేని పక్షంలో ప్రత్యామ్నాయ ఇంధనం ద్వారా మేం చేసే ఉత్పత్తికి తగు ఛార్జీలు చెల్లించాలి. మేం అలా చేస్తామన్నా ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు రావటం లేదు. అందుకే మేం పరిహారం అడుగుతున్నాం. అదింకా పరిష్కారం కావాల్సి ఉంది.
ఇతర విద్యుత్ ప్రాజెక్టులో..?
జార్ఖండ్‌లో ప్లాంట్ సిద్ధమయింది. 15 లక్షల టన్నుల కార్పెట్ కోల్. రవాణాకు అనుమతులు కూడా వచ్చాయి. కాకపోతే అక్కడ కొన్ని స్థానిక సమస్యలున్నాయి. పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాం.
రోడ్డు ప్రాజెక్టులు కూడా లాభసాటిగా లేవు కదా?
శివ్‌పురి రోడ్ ప్రాజెక్టును వివిధ కారణాల వల్ల వదులుకునే పరిస్థితులొచ్చాయి. రోడ్డు ప్రాజెక్టులంటే అనుమతులతోనే పెద్ద సమస్య. అందుకే ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని భావిస్తున్నాం.