లాన్స్‌నాయక్ హనుమంతప్పకు సేనా మెడల్
న్యూఢిల్లీ: దుర్భరమైన హిమాలయాల్లో 30 అడుగుల లోతులో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచు పెళ్లల కింద ఆరురోజులపాటు మృత్యువుతో పోరాడి అనంతరం ఆస్పత్రిలో మరణించిన వీరసైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్‌ను సైన్యం సేనా పతకంతో సత్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో గత ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా ఒక్క హనుమంతప్పను మాత్రం ఆరు రోజుల తర్వాత సహాయక దళాలు ప్రాణాలతో బయటికి తీశాయి.
అనంతరం అతన్ని సైనిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. ఆర్మీడే సందర్భంగా ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హనునమంతప్ప భార్య మహాదేవి అశోక్ బిలేబల్‌కు ఈ అవార్డు అందజేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు.