మాజీ ప్రియుడిని చంపిన చోట భర్తతో..!
గతవారం ముందిల్ మహిల్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన లేబర్ పార్టీ యువనేత వరిందర్ సింగ్‌ను ఆమె పెళ్లాడింది. ఆనందంగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. భర్తతో కలిసి పెళ్లిఫొటోలు తీసుకునేందుకు లండన్‌లోని ఓ ప్రదేశానికి వెళ్లింది. అక్కడ భర్తతో తొలి ఫొటో దిగి.. దానిని ఫేస్బుక్లో పెట్టింది.
కానీ, ముందిల్ పెట్టిన ఫొటోపై గగన్ దీప్ సింగ్ కుటుంబసభ్యులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది అమానుషం.. జుగుప్సకరమని మండిపడుతున్నారు. వారి ఆక్రోశంలో అర్థముంది. ముందిల్ దంపతులు ఫొటో దిగిన ప్రదేశానికి సమీపంలోనే సరిగ్గా ఐదేళ్ల కిందట టీవీ ఉద్యోగి అయిన గగన్ దీప్ సింగ్‌ను సజీవంగా తగులబెట్టారు. అప్పట్లో మెడికల్ విద్యార్ధినిగా ఉన్న ముందిల్ ప్రేమ పేరిట గగన్‌ను వంచించి ఆ తర్వాత అతన్ని చంపించింది. ఆగ్నేయ లండన్‌లోని గ్రీన్విచ్ పార్కులో ఉంచిన కారులో గగన్‌ను కట్టిపడేసి.. కారును తగులబెట్టేశారు. దీంతో గగన్ సజీవ దహనమయ్యాడు. ఈ కుట్రలో భాగం పంచుకున్నందుకు ముందిల్కు కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, మూడేళ్ల జైలుశిక్ష తర్వాత విడుదలైన ముందిల్ ఇటీవల వరిందర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది.
అయితే, వారి పెళ్లి వేదికకు 25 మైళ్ల దూరంలోని గ్రీన్విచ్ పార్కులో ఈ జంట తొలి ఫొటో దిగడంపై బాధితుడు గగన్ దీప్ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందిల్ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని తమకు నమ్యశక్యం కావడం లేదని గగన్ తల్లి తేజిందర్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ప్రదేశంలోనే ఆమె తన కొత్త జీవితాన్ని నిర్మించాలనుకోవడం దారుణమని పేర్కొంది. గగన్ సోదరి అమన్ దీప్ (23) ఈ ఫొటోను తీవ్రంగా తప్పుబట్టింది. ముందిల్ తీరు జుగుప్సకరంగా, అమానవీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.