‘రంగస్థల’ జీవితాల ఆధారంగా...
సురభి రంగస్థల కళాకారుల జీవితాలు గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే కథతో రూపొందుతోన్న సినిమా ‘హరే రామ హరే కృష్ణ’. దిలీప్‌ప్రకాశ్, రెజీనా జంటగా అర్జున్‌సాయిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్. నవీన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దిలీప్, రెజీనాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు చందూ మొండేటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత ఎన్. నవీన్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మే నెల్లో కులు–మనాలీలో ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు. అర్జున్‌సాయి మాట్లాడుతూ – ‘‘రంగస్థల కళాకారులందరూ ఇప్పుడు కళను వదలి ఉద్యోగాలకు వెళ్తున్నారు. అంతరిస్తున్న సంప్రదాయ కళను కాపాడే ప్రయత్నం చేసే ఓ యువజంట కథే ఈ సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు దిలీప్, రెజీనా, నటి ఆమని, కళా దర్శకుడు బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశ్‌రాజ్, ఆమని, నాజర్, కృష్ణభగవాన్, అలీ, బాబూమోహన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్.