పరపతి గోవిందా!
హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (హెచ్‌డీసీసీబీ) పరిధిలో మొత్తం 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. లావాదేవీల్లో ఉత్తమ స్థానంలో ఉన్న హెచ్‌డీసీసీబీకి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ బ్యాంకు పరిధిలోని పీఏసీఎస్‌లలో రుణ రికవరీలు భారీగా పడిపోయాయి. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న పలువురు ఖాతాదారులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో పీఏసీఎస్‌లు నష్టాల దిశగా పయనిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 27 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ఈ ఏడాది రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.
పడిపోయిన రికవరీ
జిల్లాలోని 27 పీఏసీఎస్‌లలో వసూళ్లు భారీగా పతనమయ్యాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలకు సంబంధించే అధికంగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో హెచ్‌డీసీసీబీ ఈ ఏడాది 27 పీఏసీఎస్‌లకు పైసా రుణం మంజూరు చేయలేదు. వీటిలో ఎల్మకన్నె, నవాంద్గి, యాలాల, తట్టెపల్లి, శివారెడ్డిపేట, పూడూరు, వట్టిమీనపల్లి, ధారూర్, హరిదాస్‌పల్లి, మోమిన్‌పేట్, మేకవనంపల్లి, మర్పల్లి, బంట్వారం,పరిగి, మోత్కూర్, గండేడ్, కుల్కచర్ల, గుండాల్, షాబాద్, శంకర్పల్లి, రాచకొండమైలారం, మంగల్‌పల్లి, పటేల్‌గూడ, మంచాల, కీసర, డబీర్‌పుర, దూలపల్లి, మామిడిపల్లి పీఏసీఎస్‌లున్నాయి.
బకాయిలు రూ.35 కోట్లు
హెచ్‌డీసీసీబీ పరిధిలోని 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 12,956 మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. వీరికి రూ.47.28 కోట్లు రుణ రూపేణా మంజూరు చేశారు. అయితే రుణ మంజూరులో కన్పించిన ఉత్సాహం.. రికవరీల్లో మాత్రం లేదు. ఇప్పటివరకు రూ.11.59 కోట్లు మాత్రమే వసూళ్లు చేయడం.. మెజారిటీ సభ్యులు చెల్లింపులకు మొండికేయడంతో బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. కేవలం దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి రూ.35.69 కోట్లు రుణగ్రహీతల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా స్వల్ప కాలిక రుణాల్లోనూ భారీగా బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు చేసిన మొత్తంలో కనీసం 50 శాతం రికవరీలు చేసిన వాటికి మాత్రమే ఈ ఏడాది హెచ్‌డీసీసీబీ రుణాలిచ్చింది. దీంతో 27 పీఏసీఎస్‌లకు రుణాలందక.. నిధుల నిల్వలు లేకపోవడంతో రైతులకు పైసా విదిల్చలేకపోయాయి. రికవరీల్లో పురోగతి ఉన్న 22 సంఘాలకు రూ.4 కోట్ల రుణాలను హెచ్‌డీసీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేసింది. గతేడాది కొత్తగా సహకార సంఘాలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో తమ మార్కు పాలనకు ఉపక్రమించిన పాలకులకు బకాయిలు తలనొప్పిగా మారాయి. పాతబకాయిలు వసూలు చేస్తే తప్ప కొత్తగా రుణాలివ్వమని హెచ్‌డీసీసీబీ తేల్చిచెప్పడంతో బకాయిదారులపై ఎలా ఒత్తిడి చేయాలనే సందిగ్ధంలో పడ్డారు.
ప్రభుత్వం విఫలమైంది..
ప్రభుత్వం పంట రుణాలను సకాలంలో అందించడంలో విఫలమవుతోంది. మేం పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు, రైతు సంఘాలకు ఎలాంటి ప్రత్యేక రుణాలివ్వలేదు. ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలకు కొత్తగా సబ్సిడీలు కూడా ఇవ్వలేదు. పంట నష్ట పరిహారం అందించడంలోనూ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుంది.
- నర్సింహారెడ్డి, పూడూరు పీఏసీఎస్ చైర్మన్