గుండెజబ్బుతో అకాల మరణాలు ఎందుకంటే?
కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. గుండెపైన కిరీటం ఆకృతిలో కీలకమైన ధమనులుంటాయి. (అందుకే ఈ ధమనులను ‘కరోనరీ’ ధమనులంటారు). ఈ రక్తనాళాలే గుండెకు పోషకాలను (రక్తం, ఆక్సిజన్) సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఈ ధమనులు సన్నబడి, రక్త సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. దీంతో 50 – 55 ఏళ్ల వారిలో గుండెపోటు వస్తుంది. కానీ 25%లో ఇది 40లోపు వాళ్లలో కూడా గుండెపోటు వస్తుంటుంది. ఇదీగాక కొందరు యువకుల్లో హఠాన్మరణాలు కనిపిస్తుంటాయి. దానికి రక్తసంబంధీకుల్లో జరిగే పెళ్లిళ్ల వంటి అంశాల కారణంగా జన్యుపరమైన కారణాలతో ఈ అకస్మాత్తు మరణాలు సంభవిస్తుంటాయి. ఇటీవల ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందుకు ముఖ్యమైన కారణం... వయసు పెరుగుతున్నకొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్క్లిరోసిస్ అంటారు. కొందరిలో ఈ అథెరో స్క్లిరోసిస్ మొదలైన ఏడాదిలోనే గుండెపోటు కనిపించవచ్చు. ఈ ముప్పునకు మరో ప్రధాన కారణం రక్తనాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్. ఇది క్రమంగా, నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటుంది.. కానీ కొందరిలో ఇది చాలా వేగంగా జరుగుతుంది.
ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లేక్స్’ అంటారు. ఈ ప్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల అవి సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరాను తగ్గించవచ్చు. దాంతోనూ గుండెపోటు రావచ్చు. ఇది ఛాతీలో నొప్పి రూపంలో కనిపించవచ్చు. ఈ కండిషన్ను ‘యాంజినా పెక్టోరిస్’ అంటారు. తగినంత రక్తం అందని కారణంగా గుండె కండరాలు చచ్చుపడిపోవడం ప్రారంభమవుతుంది. దాన్నే ‘హార్ట్ ఎటాక్’ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ (ఏఎమ్ఐ) అంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ వివిధ రూపాల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు... స్వల్పంగా అనిపించే ఛాతీ నొప్పి మొదలుకొని... తీవ్రమైన నొప్పి నుంచి అకస్మాత్తు మరణం వరకు ఏదైనా జరగవచ్చు.
స్టెంట్లు కూడా కాపాడలేక పోవచ్చు... ఎందుకంటే?
అంతా ఆరోగ్యంగానే ఉండి కూడా... అకస్మాత్తుగా మృతిచెందిన చాలామందిని పరిశీలిస్తే వారికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే కండిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. కొందరిలో ఏదో కారణంతో దాన్ని కనుగొని (డయాగ్నోజ్ చేసి) ఉండవచ్చు లేదా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించనందున మరికొందరిలో దీన్ని కనుగొని ఉండకపోవచ్చు. అయితే గతంలో గుండెపోటు వచ్చి ఉండి, అది బయటకు కనిపించకుండా గుండె పంపింగ్ వ్యవస్థ బలహీనపడటంతో ఈ హఠాన్మరణాలు సంభవించే అవకాశం ఉంది.
ధమనులు మూసుకుపోవడంతో గుండెకు తగినంత రక్తం సరఫరా జరగడం లేదని గుర్తించినవారికి యాంజియోప్లాస్టీ చేయడం, స్టెంట్ అమర్చడం చేస్తారు. కానీ అలాంటి చికిత్స అందించినవారిలోనూ... చాలా అరుదుగానే అయినా కొందరు మృతిచెందుతుంటారు. స్టెంట్ వంటివి గుండెకు అవసరమైన రక్తసరఫరాను తప్పక పెంచుతాయి. అందులో సందేహం లేదు. కానీ అవి అమర్చేనాటికే... వారికి తెలియకుండానే గుండెపోటు వచ్చిన సందర్భాల్లో గుండె కండరాలు అప్పటికే బలహీనమై ఉండవచ్చు. బలహీనపడ్డ గుండె భాగాల్లో గుండెకు గాయమై (స్కార్ వచ్చి) ఉండవచ్చు. అలాంటి వారిలో... స్పందనలకు కారణమయ్యే గుండె తాలూకు ‘ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్’ అసాధారణంగా (అబ్–నార్మల్గా) మారవచ్చు.
దాంతో గుండె స్పందనలు, గుండెవేగం విపరీతంగా పెరగవచ్చు. ఫలితంగా గుండెదడ (వెంట్రిక్యులార్ టాచీకార్డియా), వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ వంటి కండిషన్ల వల్ల అకస్మాత్తు మరణం (సడన్ కార్డియాక్ డెత్) సంభవించవచ్చు. ఇలాంటి రోగుల్లో వాస్తవమైన గుండెపోటు ఎప్పుడో 10 – 20 ఏళ్ల కింటే వచ్చి ఉండవచ్చు. ఇలాంటివారికి మరోమారు గుండెపోటు వచ్చిందంటే వారిలో కేవలం 30% – 40% మాత్రమే బతికేందుకు అవకాశముంటుంది. మొదటిసారి గుండెపోటు వచ్చాక... గుండె కండరం బలహీనమైన వారికి ‘డయలేటెడ్ కార్డియోమయోపతి’ అనే కండిషన్ ఉంటుంది. అలాగే మరికొందరికి ఎలాంటి గుండెపోటూ రాకపోయినప్పటికీ గుండె కండరం బలహీనంగా ఉంటుంది. మరికొందరికి వంశపారంపర్యంగానే జన్యుపరంగా గుండెకండరం బలహీనంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలోని వారు హఠాన్మరణాలకు గురవుతుంటారు.
ఇప్పుడు గుండెస్పందనల్లో కరెంటుకు సంబంధించిన అసాధారణతలకు కారణమయ్యే సమస్యలను (కార్డియాక్ ఎలక్ట్రికల్ డిజార్డర్స్)ను గుర్తించి తక్షణం చికిత్స అందించే ఎలక్ట్రోఫిజియాలజీ అనే అత్యాధునిక వైద్యవిభాగం చాలా బాగా అభివృద్ధి చెందింది. లక్షణాల ఆధారంగా ‘కాథ్’ లాబ్లలో ఎలక్ట్రో ఫిజియలాజికల్ స్టడీస్ ద్వారా బాధితులకు కలగబోయే ముప్పును కచ్చితంగా అంచనావేయవచ్చు. అంతేకాదు... అంతకు మునుపు లక్షణాలేమీ లేకుండా గుండెపోటు వచ్చినందున... అది ఎప్పుడో ఏదో సందర్భంలో ఈసీజీ తీసినప్పుడు తెలిసిపోయి, ఇతర పరీక్షలు నిర్వహించి సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేయడం కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. తద్వారా అవాంఛిత అకస్మాత్తు /హఠాన్మరణాలను తేలిగ్గా నివారించవచ్చు.
నిర్ధారణ /నివారణ / చికిత్స
ఇక చికిత్స విషయానికి వస్తే... ‘ఇంప్లాంటబుల్ కార్డియోవెక్టార్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)’ అనే ఉపకరణాన్ని బాధితుల దేహంలోనే అమర్చడం ద్వారా ఆకస్మిక మరణాలను నివారించవచ్చు. దేహంలోని ఈ ఉపకరణం నుంచి వచ్చే కొన్ని వైర్లను రక్తనాళాల ద్వారా గుండె కుడివైపు కింది గదిలో అమర్చుతారు. అదో మినీ కంప్యూటర్లా పనిచేస్తుంది. మంచి సమర్థత ఉన్న ఎలక్ట్రో కార్డియాక్ నిపుణుల కచ్చితమైన నైపుణ్యంతో కూడిన ప్రోగ్రామింగ్ వల్ల అది... గుండె ఎలక్ట్రిక్ సర్కుట్స్లో తేడాలు గ్రహించి, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉంటుంది. ఈ పరిజ్ఞానం హఠాన్మరణాల నివారణలో విప్లవాత్మకమైన ముందడుగు అని చెప్పవచ్చు.
సీపీఆర్ ప్రాధాన్యత...
ఇలా అకస్మాత్తుగా గుండె సమస్య వచ్చి కొద్దిక్షణాలపాటు గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వారికి సీపీఆర్ ఇవ్వడం ద్వారా హాస్పిటల్కు తీసుకు వచ్చేముందరే గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. ఇందుకు గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కుతుంటారు. ఈ ప్రక్రియనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అంటారు. గుండె కండరాలు ఆగిన (కార్డియాక్ అరెస్ట్ జరిగిన) కొద్ది క్షణాల్లోపు ఈ ప్రక్రియను అనుసరిస్తే ఆ కీలకమైన క్షణాల్లో బాధితుడిని రక్షించవచ్చు. సీపీఆర్ వల్ల గుండె కండరాలనీ ఉత్తేజపరచి, మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందడం ప్రారంభమయ్యేలా చేయవచ్చు.
దాంతో బాధితుడిని కాపాడే అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పుడున్న అత్యాధునిక పురోగతి వల్ల గుండెలో విద్యుత్ వ్యవస్థ కారణంగా వచ్చే తేడాలను సరిదిద్దేందుకు ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గుండెదడ (టాకికార్డియా) / వెంట్రిక్యులార్ డీ ఫిబ్రిలేషన్ బాధితులను రక్షించే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) పరికరాన్ని ఆంబులెన్సుల్లో అమర్చి వాటిని పోలీస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ స్థలాల్లో ఉంచడం వల్ల చాలామందిని రక్షించడానికి వీలవుతుంది.
మన దేశంలో పరిస్థితి...
మన దేశంలో హఠాన్మరణాలు చాలా ఎక్కువ. ఇతర దేశాల్లో ఈ సమస్య చాలా వయసు పైబడినవారిలోనే వస్తుంది. కానీ మన దేశంలో ఇది యువతలోనూ చాలా సాధారణంగా / ఎక్కువ గా కనిపిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం మొత్తం మరణాల్లో ఇలాంటివి 10% పైబడే ఉండవచ్చని అంచనా. తగిన సమయంలోనే చికిత్సలు అందించగలిగితే కీలకమైన మెదడు కండరాలు చచ్చుబడేలోపే బాధితులను సమర్థంగా కాపాడవచ్చు.
డాక్టర్ హైగ్రీవ్ రావు
సీనియర్ కార్డియాలజిస్ట్
– ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్