స్పైస్‌జెట్‌కు 205 బోయింగ్ విమానాలు
రూ. 1.5 లక్షల కోట్ల డీల్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌తో భారీ డీల్ కుదుర్చుకుంది. 205 విమానాల దాకా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు విలువ దాదాపు రూ. 1,50,000 కోట్లుగా ఉండనుంది. ఇప్పటికే ఆర్డరు చేసిన 55 విమానాలు, 100 కొత్త 737–8 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు మరో 50 బీ737–8 మ్యాక్స్, వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు హక్కులు దక్కించుకోవడంతో .. మొత్తం 205 దాకా స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తున్నట్లవుతుందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు.
దేశీ విమానయాన రంగంలో కుదిరిన అతి పెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటి కాగా.. తమకు సంబంధించి ఇది అత్యంత భారీదని వివరించారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ వద్ద బీ737 విమానాలు 32, బంబార్డియర్ క్యూ400 విమానాలు 17 ఉన్నాయి. తాజా డీల్‌కు సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు అజయ్ సింగ్ వివరించారు. ఇంధనం దాదాపు 20 శాతం దాకా ఆదా చేసే కొత్త విమానాలతో వ్యయాలు తగ్గగలవని బోయింగ్ కంపెనీ వైస్ చైర్మన్ రే కానర్ తెలిపారు.
లాభదాయకతపైనే దృష్టి ..
మార్కెట్ వాటా గురించి తీవ్రంగా పోటీపడటం కన్నా బాధ్యతాయుతమైన రీతిలో లాభదాయకంగా ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని అజయ్ సింగ్ చెప్పారు. గతంలో రోజుకు రూ. 3 కోట్లు నష్టపోయిన స్పైస్‌జెట్ ప్రస్తుతం రోజుకు రూ.1 కోటి మేర లాభాలు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ గణాంకాల ప్రకారం.. 12.8 శాతం మార్కెట్ వాటాతో స్పైస్‌జెట్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, చౌక చార్జీలతో దూరప్రయాణాల విమానాలు నడిపే అంశం పరిశీలిస్తున్నట్లు సింగ్ చెప్పారు. కొత్త విమానాల డెలివరీ 2018 మూడో త్రైమాసికంలో ప్రారంభమై 2024 నాటికి ముగుస్తుంది. డీల్ మేరకు పైలట్ల శిక్షణ కోసం బోయింగ్ తోడ్పాటుతో స్పైస్‌జెట్ ప్రత్యేకంగా సిమ్యులేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది 2018 నాటికి సిద్ధం కాగలదు. విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం 20 పైగా విమానాలున్న దేశీ ఎయిర్‌లైన్స్.. కనీసం ఒక్క సిమ్యులేటర్ కేంద్రాన్నైనా కలిగి ఉండాలి.