ఎక్కువ చేస్తే అంతే..
కాన్బెర్రా(ఆస్ట్రేలియా): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు తగినంత వ్యాయామం కూడా అవసరం. అయితే అది పరిమితికి మించి ఉండరాదని అంటున్నారు ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు. రోజూ వ్యాయామం చేసేవారు గంట, రెండు గంటలకు మించి చేయకూడదని.. నాలుగు, అయిదు గంటలు వ్యాయామం చేస్తే పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందంటున్నారు. తద్వారా రక్తం విషపూరితంగా మారి ప్రాణానికి ప్రమాదం చేకూరుస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని చెప్పారు.
తగిన ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేస్తే క్యాలరీలు పూర్తిగా ఖర్చైపోయి మనిషి శారీరకంగా కుంగిపోయే ప్రమాదం కూడా ఉందని వారు అంటున్నారు. అలాగే మోతాదు మించి వ్యాయామం చేస్తే శరీరంలోని ఎముకలకు రాపిడి ఎక్కువై కరిగిపోయే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ వ్యాయామం చేసేవారి రక్త నమూనాలు వ్యాయామానికి ముందు వ్యాయామానికి తరువాత సేకరించి పరీక్షలు జరిపి ఆ వివరాలును వెల్లడిస్తున్నట్లు వారు ప్రకటించారు.