విమానాల్లో రహస్య బెడ్ రూమ్‌లు!
విమానాల్లో సుదూర ప్రయాణాలు చేయడమంటే మాటలు కాదు. ప్రయాణికులతోపాటు వారికి సేవలు అందించే విమానం సిబ్బంది గంటలకొద్ది సాగే ప్రయాణంలో అలసిపోతారు. ప్రయాణికులంటే సీట్లలో ప్రశాంతంగా కూర్చుంటారు. మరీ విమానం సిబ్బంది పరిస్థితి ఏమిటి? విమాన ప్రయాణంలో వారు కాసింత విశ్రాంతి తీసుకోవాలంటే ఎలా?..
అందుకు విమానంలోనే వారికోసం రహస్య ఏర్పాటు ఒకటి ఉంటుంది. బోయింగ్ 777, 787 వంటి పెద్ద విమానాల్లో ఎయిర్‌హోస్టెస్, ఇతర విమాన సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి రహస్య బెడ్రూమ్లు ఉంటాయి. వీటిని క్రూ రెస్ట్ డిపార్ట్మెంట్స్ అని పిలుస్తారు. కాక్‌పిట్ వెనుక ఫస్ట్ క్లాస్ పైన ఇవి ఉంటాయి. రహస్యంగా ఉండే ఈ ప్రదేశాన్ని సాధారణంగా ప్రయాణికులు గుర్తించే వీలుండదు. డోర్ వెనుకాల రహస్యంగా ఉండే చిన్నపాటి మెట్లపై నుంచి ఎక్కి వెళితే ఇక్కడికి చేరుకోవచ్చు. లోపలికి వెళ్లేందుకు యాక్సెస్ కార్డు లేదా కోడ్ ఉంటుంది. విమానం పరిణామం బట్టి అందులో సిబ్బంది విశ్రాంతి గదులు ఉంటాయి. ఇవి సహజంగా చాలా ఇరుగ్గా ఉంటాయి. వీటికి కిటికీలు కూడా ఉండవు. పూర్తిగా అన్నివైపుల కప్పివేయబడి ఉంటాయి. ఇందులో ఎనిమిది వరకు పడకమంచాలు ఉంటాయి. బోయింగ్ 777 విమానంలో ఆరు నుంచి పది వరకు పరుపులు ఉంటాయి. దీనికి అదనంగా సింక్తోపాటు ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది. విమానంలో సిబ్బంది కోసం ఇలాంటి ఏర్పాటు ఉంటుందని సాధారణంగా చాలామందికి తెలియదు. ఈ విశ్రాంతి గదుల్లో సేదదీరుతున్న ఎయిర్‌హోస్టెస్ ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
చూడటానికి శవపేటికల్లా ఉంటాయి!
'బోయింగ్ 747 విమానంలో బంక్ పరుపులు (ఒకదానిపై ఒకటి ఉండేవి) ఉంటాయి. బోయింగ్ 777 విమానంలోనైతే ఇవి శవపేటికల్లా చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి దిండు, దుప్పటి కూడా ఇస్తారు. నిద్రపోయేముందు ధరించేందుకు నేను ఎప్పుడూ సొంత పైజామాలే తీసుకెళుతాను. అవసరమైతే బిజినెస్ క్లాస్‌లోని దిండు, దుప్పటి తీసుకోవచ్చు. ఇందులో కొన్ని ప్రాథమిక సదుపాయాలు ఉంటాయి. చిన్నపాటి టీవీలు కూడా ఉంటాయి. కానీ అవి ఐప్యాడ్ కన్నా చిన్నవిగా ఉంటాయి' అని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తెలిపారు.