విరాట్ కోహ్లికి రోజుకు 5 కోట్లు..!
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి... బాలీవుడ్ దిగ్గజాలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ కంటే కాస్ట్ లీగా మారారు. విరాట్ కోహ్లికి ఎండోర్స్మెంట్ కింద చెల్లించే ఫీజులు రోజుకు 5 కోట్లకు జంప్ చేశాయి. కొత్త కాంట్రాక్ట్‌లకు ఆయన సంతకాలు చేయడంతో ఎండోర్స్మెంట్ల ద్వారా కోహ్లి ఆర్జించే ఆదాయం భారీగా రూ.5కోట్లకు పెరిగింది. అంతకముందు కోహ్లి రోజుకు కేవలం రూ.2.5 కోట్ల నుంచి రూ.4 కోట్లు మాత్రమే ఆర్జించేవారు. ఈ పెంపుతో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే బ్రాండు అంబాసిడర్ గా కోహ్లి నిలిచారు. ఆశ్చర్యకరంగా ఈ పారితోషికం, అంతకముందు ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ రణబీర్, రణ్వీర్ కపూర్ల కంటే ఎక్కువ.
తాజా అంచనాల ప్రకారం షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లకు రోజుకు చెల్లించే ఎండోర్స్ మెంట్ ఫీజులు 3 నుంచి 3.5 కోట్ల మధ్యనే ఉన్నట్టు తెలిసింది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్టు ప్రకారం.. కోహ్లి ఇటీవల రెండు బ్రాండులకు ఎండోర్స్మెంట్ కు ఒప్పుకోవడంతో ఈ ఫీజులు పెరిగినట్టు తెలిసింది. జర్మన్ స్పోర్ట్స్ వేర్ బ్రాండు పుమాకు ఎనిమిదేళ్ల కాంట్రాక్ట్ పై సంతకం పెట్టినట్టు కోహ్లి గత నెలే ప్రకటించారు. ఈ డీల్ కింద కోహ్లి రూ.110 కోట్లు ఆర్జించనున్నారు. మొత్తంగా 18 బ్రాండులను ఆయన ఎండోర్స్ చేసుకున్నారు. ఆడి కార్లు, ఎంఆర్ఎఫ్ టైర్లు, టిస్సోట్ వాచ్ లు, జియోనీ ఫోన్లు, బూస్ట్ మిల్క్ డ్రింక్, వంటి ఉత్పత్తులు దీనిలో ఉన్నాయి. పలు కంపెనీల్లో సైతం కోహ్లి పెట్టుబడులున్నాయి.