యూపీలో మరో దారుణం
పాత్రికేయుడి తల్లికి నిప్పంటించిన పోలీసులు
బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం! జితేంద్రసింగ్ అనే పాత్రికేయుడిని పోలీసులు సజీవదహనం చేసిన ఉదంతం మరువకముందే అలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను విడిపించుకునేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఓ పాత్రికే యుడి తల్లికి పోలీసులు నిప్పంటించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. బారాబంకీ జిల్లా కోథీ పోలీసు స్టేషన్ పోలీసులు స్థానిక హిందీ దినపత్రిక జర్నలిస్టు సంతోష్ తండ్రి అయిన రామ్ నారాయణ్‌ను ఈవ్‌టీజింగ్ కేసులో విచారించాలంటూ శనివారం తీసుకె ళ్లారు. భర్తను విడిపించుకునేందుకు స్టేషన్‌కు వచ్చిన నీతూను పోలీసులు రూ. లక్ష డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమెను అవమానించి, దుర్భాషలాడి గెంటేశారు. తర్వాత పెట్రోల్ చల్లి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన బాధితురాలు లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసు స్టేషన్ ఇన్చార్జి రామ్ సాహెబ్ సింగ్ యాదవ్, ఎస్ఐ అఖిలేశ్ రాయ్‌లే తన కు నిప్పంటించారని బాధితురాలు మేజిస్ట్రేట్, మీడియా ముందు వాంగ్మూలం ఇచ్చింది.
‘అందరూ చోద్యం చూస్తున్నారు. నాకెవరూ సాయం చేయలేదు. నాపై పెట్రోల్ చల్లి, అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారు’ అని చెప్పింది. అయితే, బాధితురాలే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. తన తల్లికి పోలీసులే నిప్పంటించారని సంతోష్ చెప్పారు. పోలీసులపై మోపిన అభియోగాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తన తండ్రిని అక్రమంగా 24 గంటలు నిర్బంధంలో ఉంచుకున్నారన్న కారణంతోనే ఇద్దరు పోలీసు అధికారులనూ సస్పెండ్ చేశారన్నారు. వారిపై హత్య కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఈ ఉదంతంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించామని సీఎం అఖిలేశ్ వెల్లడించారు.