రమజాన్ మాసంలో... హిరా గుహల్లో...
ప్రవక్త జీవితం
‘విన్నారు కదా బాబు అభిప్రాయం’ అంటూ ఆయన జైద్ చేయి పట్టుకొని ఖురైష్ పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళారు.‘ఖురైష్ వంశ పెద్దలారా! వినండి. ఈరోజు నుండి ఈ అబ్బాయి నా కొడుకు. ఇతను నా వారసుడు. నేను ఇతనికి వారసుణ్ణి. దీనికి మీరే సాక్ష్యం’ అంటూ బహిరంగంగా పెద్దల సమక్షంలో ప్రకటించారు.
ఈ అపురూప దృశ్యాన్ని అవాక్కయి వీక్షిస్తున్న హారిసా ఆనందానికి అవధులు లేకుండా పొయ్యాయి. కొడుకును మక్కాలోనే ముహమ్మద్ గారి దగ్గర వదిలి పరమ సంతోషంగా వెళ్ళిపోయాడు.
తరువాత కొన్నాళ్ళకు అలీ కూడా ఆయన సంరక్షణలోకొచ్చారు. అదెలాగంటే, అబూతాలిబ్‌కు గంపెడు సంతానం, సంసార సాగరం ఈదలేక పాపం ఆయన సతమతమవుతున్నారు. అంతలో అరేబియాలో వచ్చిపడిన కరువు రక్కసి ఆయన్ని మరింత కుంగదీసింది. ఇదంతా గమనిస్తున్న ముహమ్మద్ గారి మనసు తల్లడిల్లిపోయింది. బాబాయి అబ్బాస్ గారిని కలిసి, బాబాయి సంతానంలోంచి ఓ ఇద్దరిని మనం మన సంరక్షణలోకి తీసుకుందాం. ఇలానైనా ఆయనకు కాస్త భారం తగ్గుతుందేమో! అన్నారు. తరువాత ఇద్దరూ కలిసి బాబాయి అబూతాలిబ్ గారి వద్దకు వెళ్ళి విషయం చెప్పారు. ఆయన పరమ సంతోషంతో అంగీకరించారు. ఈవిధంగా అబ్బాస్ జాఫర్‌ను, ముహమ్మద్ గారు అలీని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఇప్పుడు జైద్, అలీలు ఇద్దరికీ ఆయన తండ్రి అయిపోయారు.
కాలం గడిచిపోతోంది. ముహమ్మద్ వయసు ఇప్పుడు నలభైకి చేరుకుంది. అయినా ఆయన దినచర్యలో ఎలాంటి మార్పూలేదు. అనాథల్ని, దిక్కూమొక్కూ లేనివారిని ఆదరించడం, సాటివారి కష్టాల్లో పాలుపంచుకోవడం, సమాజ సంక్షేమం, లోకకల్యాణం, మానవ మోక్షాలే ఆయన జీవితాశయంగా అహోరాత్రులు దైవ చింతనలో, సత్యాన్వేషణలో పవిత్ర జీవితం గడుపుతున్నారు. అంతలో రమజాన్ మాసం వచ్చింది. దీంతో ఆయన ఆరాధనలలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ప్రారంభించారు. రమజాన్ మాసంలో కొన్నిరోజులు గడిచాయి. ఆయన యధాప్రకారం ‘హిరా’గుహలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రాతఃకాల సమయాన, ఒక్కసారిగా,
అకస్మాత్తుగా హిరా గుహ కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్య కాంతులతో దగద్ధగాయమానంగా వెలిగిపోయింది. ఈ హఠాత్పరిణామాన్నుండి ముహమ్మద్ తేరుకోకముందే, ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు.
అద్భుతమైన ముఖవర్ఛస్సుతో, అసాధారణ దివ్యతేజస్సుతో ఉన్న ఆ దైవదూత వచ్చీరాగానే ‘చదువు’ అని ఆదేశించాడు.
‘నాకు చదువురాదు’ అన్నారు ముహమ్మద్ కాస్త భయంభయంగా.
ఈసారి దైవదూత ముహమ్మద్‌ని వాటేసుకొని అదిమి, ‘చదువు’ అని మళ్ళీ ఆదేశించాడు. మరలా అదే సమాధానం... ఈసారి మరి కాస్తగట్టిగా అదిమి వదిలేస్తూ, ‘చదువు’ అని మళ్ళీ పురమాయించాడు. ఈసారి మరింత బాధతో, ఊపిరాడనంతపనయింది.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)