ఇది మలి మధ్యయుగ చారిత్రక దృశ్యం!
చరిత్ర పరిశోధన లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఒక వాస్తవం గమనించక తప్పదు. గతంతో వర్తమానం సంభాషి స్తూనే ఉంటుంది. సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్య వస్థ, ఆర్థిక వ్యవస్థ, మానవ సంబంధాలు, కళలు ఇవన్నీ గతం పునాది మీదే పటిష్టమవుతాయి. చరి త్ర ప్రస్థానంలోని కొన్ని కొన్ని బిందువులు ఇలాంటి మలుపులకు ఆలవాలంగా ఉంటాయి. తెలుగు వారి చరిత్రలో మలి మధ్యయుగం ఇందుకు నిదర్శనం. చరిత్రకారుల దృష్టి కోణం నుంచి చెప్పాలంటే క్రీస్తు శకం 1324-1724 మధ్య కాలమన్నమాట. ఈ చరి త్రనే ‘మలి మధ్యయుగ ఆంధ్రదేశం’ పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సంయుక్తంగా ఇప్పుడు మన ముం దుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సం స్కృతి పేరుతో చరిత్ర కాంగ్రెస్ వెలువరిస్తున్న సంపు టాలలో ఇది ఐదవది. సంపాదకులు-ఆర్. సోమా రెడ్డి (విశ్రాంత ఆచార్యులు, చరిత్రశాఖ, ఉస్మాని యా విశ్వవిద్యాలయం).
ఒక సమున్నత ఆశయంతో తెలుగువారి చరి త్రను ఎనిమిది సంపుటాలలో అందించాలని ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1998లో నిర్ణయించింది. అప్పటి నుంచి అవిశ్రాంతంగా జరుగుతున్న కృషి ఫలితంగా వెలువడిన సంపుటాలలో ఇది ఐదవది. మిగిలిన మూడు సంపు టాల పని కూడా దాదాపు పూర్తి కావ చ్చింది. ఈ సంవత్సరాంతానికి ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని సంపాదక మండలి నిర్ణయించింది.
ఐదో సంపుటి కూడా ఆ కాలపు విస్తృత చారిత్రక, సామాజిక చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుంది. ముసునూరి నాయకుల ఆవిర్భావంతో ఆరంభమై, బహ్మ నీలు, కుతుబ్‌షా హీలు, మొగలుల ప్రభావంవరకు వివరించే ఈ గ్రంథం సారం ఏమిటో, ఇంకా చెప్పా లంటే ఆత్మ ఎలాంటిదో ‘సంధిదశ’ పేరుతో సంపా దకుడు రమణీయంగా ఆవిష్కరించారు. కాకతీయు ల తరువాత తెలుగు ప్రాంత రాజకీయ ఐక్యత తుగ్లక్‌ల చేతిలో ఎలా విధ్వంసమైనదో చెబుతూ ఈ పుస్తకం ఆరంభమవుతుంది. ఆపై ముసునూరి నా యకులు, కొండవీడు, రాజమహేంద్రవరం, రెడ్డిరా జ్యాల గురించి వివరణ ఉంది. తెలుగు ప్రాంతాల మీద విజయనగర రాజ్య ప్రభావం మరో ముఖ్యమైన అంశం.
ఈ అన్ని శతాబ్దాలలోను తెలుగు ప్రాంతం అనేక పాలక విధానాలను, పరిణామాలను చూసింది. వాటి మీద తెలుగు ప్రజానీకం స్పందన ఏమిటి? సేద్యం, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, కళల మీద, విద్య మీద ఆయా పాలక వ్యవస్థ ప్రభావం ఎలాంటిది? ఇవన్నీ తరు వాత అధ్యాయాలలో విస్తృతంగా చర్చించారు. ఇను ము-ఉక్కు పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు, వర్తక వాణిజ్యాలు, విదేశీ వాణిజ్యం, పట్ట ణీకరణ, విజయనగరంలో దేవదాసీ వ్యవస్థ, వైద్య విధానాలు, ఆహారం, వేడుకలు, ఆహార్యం వంటి అంశాల గురించి నిపుణులు వివరించారు. ఉపోద్ఘా తంలో చెప్పినట్టు ఇదొక సంధిదశ. ఇలాంటి కాలం లో అప్పటికే వేళ్లూనుకుని ఉన్న హిందూమతం, ఇస్లాంల ఉనికి ఎలాంటిది? అప్పుడే కాలూనడానికి ప్రయత్నిస్తున్న క్రైస్తవం అస్తిత్వం ఏమిటి? ఇవి ఆసక్తికరమైన అంశాలు. వీటిని పీవీ పరబ్రహ్మశాస్త్రి వంటి ఉద్దండులు చర్చించారు. రంగస్థల కళల గురించి నాగభూషణశర్మ వంటి నిపుణునితో రాయించడం సముచితంగా ఉంది. సంగీతం, సం స్కృతం, తెలుగు సాహిత్యాలు, స్త్రీల రచనలు, తెలు గు భాషాభివృద్ధి, ఉర్దూ, పర్షియన్ భాషా సాహి త్యాల గురించి కూడా విశ్లేషించారు . ఇంతటి కృషికి ప్రధాన సంపాదకులు వకుళాభరణం రామకృష్ణ, సంపాదకులు సోమారెడ్డి, ఇతర సభ్యులు ఐ. లక్ష్మి, సి. సోమసుందరరావు, కీ.శే. బి. రాజేంద్రప్రసాద్ అభినందనీయులు.
ఇది తెలుగు ప్రాంతం రెండుగా విభజించ డానికి ముందు ఎప్పుడో ఆరంభమైన ఆలోచన. రెం డు ప్రాంతాల చరిత్రకారులు ఈ మహా కృషిలో భాగం పంచుకున్నారు. రాబోయే సంపుటాలలో కూ డా కృషిని అందించబోతున్నారు. రెండు ప్రాంతాల ఉమ్మడి చరిత్ర కాబట్టే ఇది సాధ్యమైంది.
(‘మలి మధ్య యుగ ఆంధ్రదేశం’ గ్రంథాన్ని నేటి సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టర్ కేవీ రమణాచారి ఆవిష్కరిస్తున్నారు. మండలి బుద్ధ ప్రసాద్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ రమేశ్‌కుమార్ ప్రసంగిస్తారు)