పోలీసులూ .. కుమ్మక్కైతే ఇక అంతే!
జమ్మూ: తమ రాష్ట్ర పోలీసులకు జమ్మూకాశ్మీర్ పోలీసు బాసు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భూకబ్జాలకు పాల్పడేవారితో కుమ్మక్కై వారితో వ్యవహారాలు నడుపుతున్నట్లు ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఐజీపీ దానిశ్ రాణా హెచ్చరించారు. చాలాకాలంగా జమ్మూ రాష్ట్రంలో మాఫియా వారితోను, మోసాలు, నేరాలకు పాల్పడేవారితోను పోలీసులు కుమ్మక్కై పనిచేస్తున్నారనే అపవాదు ఉంది.
మాఫియా లీడర్లు చేసే అక్రమాలకు పోలీసులు సహకరిస్తున్నారని, భూముల కబ్జాల్లో భాగం పంచుకుంటున్నారని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఐజీపీ ఈ ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్లు, మాఫియా లీడర్లు కఠినంగా శిక్షించడానికి అర్హులని వారి విషయంలో దాతృత్వం వహించడం ఏమాత్రం అంగీకరించకూడని విషయమని, పోలీసులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి కేసుల్లో ఆలస్యం ఉండబోదని చెప్పారు.