గత సర్కారును పొగిడిందని అధికారిణికి షాక్!
గత ప్రభుత్వాలపై గురించి చెప్పాల్సి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వానికి కోపం రాకుండా అధికారులు జాగ్రత్త పడాలేమో.. హర్యానాలో తాజాగా జరిగిన ఉదంతం ఇదే చాటుతోంది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించేలా ఆర్టీఐ కింద వివరాలు వెల్లడించిన ఓ మహిళా అధికారికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఏకంగా ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ముందున్నదని పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారిణి సునితా దేవి ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారు. ఇది సహజంగానే రాజకీయంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేసింది. అయితే, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని, అందుకే ఆమెపై చార్జిషీట్ కూడా దాఖలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారని హర్యానా అధికార వర్గాలు చెప్తున్నాయి.