నిధులు రాక.. నడపలేక
• విద్యార్థినులను పస్తులు ఉంచలేక.. అప్పులు ఇవ్వక..
• అవస్థలు పడుతున్న స్పెషలాఫీసర్లు
• కేజీబీవీల నిర్వహణకు టెండర్లు పిలవని ప్రభుత్వం
• అడ్వాన్సు చెల్లింపులోనూ అదే నిర్లక్ష్యం
• బంగారు నగలు తాకట్టుపెట్టి హాస్టల్ నిర్వహణ
సాక్షి ప్రతినిధి, కడప: కేజీబీవీల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు స్పెషలాఫీసర్లు స్కూళ్లను నడపడానికి అల్లాడిపోతున్నారు. నిధులు కేటారుుంపులో నిర్లక్ష్యం తాండవిస్తోంది. అడ్వాన్సులు లేవు.. బిల్లులు జమకావు. వెరసి స్పెషల్ ఆఫీసర్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యార్థినులను పస్తులు ఉంచలేక, హాస్టల్స్ నిర్వహించలేక సతమతమవుతున్నారు. ఇంట్లో ఉన్న బంగారం సైతం తాకట్టుపెట్టి నిర్వహించేవారు కొందరైతే, అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు ఇంకొందరు. బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పేదరికంలో ఉన్నవారి కోసం కేజీబీవీలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో 29 కేజీబీవీలున్నారుు. విద్యాబోధనతోపాటు చక్కటి హాస్టల్ వసతి సమకూర్చారు. వాటి పరిధిలో దాదాపు 6 వేలమంది విద్యార్థినులు చదువున్నారు. ప్రతి హాస్టల్లో సరాసరిన ఒకరోజుకు క్వింటా బియ్యం అవసరం. ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తుండగా, టెండర్దారులు సరుకులు సరఫరాకు చేస్తున్నారు. కాగా కూరగాయాలు, పండ్లు, గుడ్లు, పాలు, గ్యాస్, చికెన్ తదితర వస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించలేదు. వాటిని ఎస్ఓలే తెప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకుగాను నెలకు రూ.1లక్ష అడ్వాన్సు సర్వశిక్షా అభియాన్ చెల్లించేది. ఈమొత్తం ఏడు నెలలుగా చెల్లించడం లేదు. ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
బంగారు నగలు సైతం తాకట్టు
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు అంతా మహిళా ఉద్యోగులే. నిధులు అందకపోవడంతో ఏడు నెలలపాటు హాస్టల్ నిర్వహణ వారికి కష్టతరంగా మారింది. ఇప్పటికే కొందరు అప్పులు చేశారు, ఆపై బంగారు నగలు తాకట్టుపెట్టారు. చిరుద్యోగులుగా ఉన్న తమకు కేజీబీవీలు నిర్వహించడం భారంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఏడు నెలలపాటు బిల్లులు జమకాలేదని, ఇంకెంత కాలం భరించాలంటూ ఉన్నతాధికారులను ఆశ్రరుుస్తున్నారు. ప్రతి కేజీబీవీకి దాదాపు రూ.7లక్షలు రావాల్సి ఉందని ఉన్నతాధికారులు సర్దిచెప్పి పంపుతున్నారని, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వేధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు.
రూ.1కోటి మాత్రమే మంజూరు: ఎస్ఎస్ఏ పీఓ వెంకటసుబ్బయ్య
కేవీజీబీల నిర్వహణకు సంబంధించి జిల్లాకు రూ.5కోట్లు నిధులు రావాల్సి ఉంది. అందులో ఇటీవల రూ.1కోటి మాత్రమే మంజూరు చేశారు. స్పెషల్ ఆఫీసర్లకు ఏడు నెలలుగా అడ్వాన్సు బిల్లులు చెల్లించలేదు. నిధుల కొరతే కారణం. ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లాం. నిధుల కోసం వేచియున్నాం. త్వరలో పరిష్కారం లభిస్తోందని ఆశిస్తున్నాం.