బాలికలకూ టాయిలెట్లు లేవా?
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై హక్కుల కమిషన్ విస్మయం
నివేదిక సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు వేరుగా టాయిలెట్లు లేకపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్లు ఉన్నా బాలబాలికలకు కలిపి ఉండడం, మరికొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా పడి ఉండడంపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో సరైన టాయిలెట్లు లేక బాలబాలికలు ఎదుర్కొంటున్న కష్టాలపై ‘‘ఎన్నాళ్లీ వ్యథ’’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ మానవ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోమరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డి శుక్రవారం విచారణకు స్వీకరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి డిసెంబర్ 19లోగా నివేదిక సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల పాఠశాలల్లో టాయిలెట్లు అందుబాటులో లేవని సోమరాజు వివరించారు. టాయిలెట్లు లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది వారి హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే బాలురు మూత్రవిసర్జన చేయాల్సి వస్తోందని, దీంతో వారు రోగాలబారిన పడుతున్నారని తెలిపారు. హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.